- ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తాం
ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీ సేవ నిర్వాహకులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. సోమవారం ఆర్టీసీ కళాభవన్లో తెలంగాణ మీసేవ ఫెడరేషన్ 14వ వార్షికోత్సవం జరిగింది. టీజీటీఎస్చైర్మన్ మన్నే సతీశ్, ఈఎస్డీ కమిషనర్(మీసేవ) రవికిరణ్ తో కలిసి ప్రభుత్వానికి చెందిన కొన్ని కొత్త సర్వీసులను మీ సేవలో ప్రారంభించారు.
చనిపోయిన మీసేవ నిర్వాహకుల కుటుంబాలకు 5 లక్షల చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీసేవ నిర్వాహకుల కమీషన్ ను శాస్త్రీయ పద్ధతిలో పెంచుతామని తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని, వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై త్వరలోనే సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గాడిలో పెడుతున్నామన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై ఎలాంటి సందేహం పెట్టుకోవద్దన్నారు. సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.శంకర్, మహమ్మద్ మీసేవ నిర్వాహకులు భారీగా పాల్గొన్నారు.