30 వేల జాబ్స్ వస్తయ్.. మంత్రి శ్రీధర్ బాబు

30 వేల జాబ్స్ వస్తయ్.. మంత్రి శ్రీధర్ బాబు
  • విదేశీ పర్యటనలో రూ.31,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నం
  • గతంలో కేసీఆర్ చైనాకు పోతే రూ.200 కోట్లు కూడా రాలేదు 
  • కంపెనీలు పోతున్నాయని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్

హైదరాబాద్, వెలుగు: త్వరలోనే కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్​శ్రీధర్​బాబు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యమేంటో చెప్పేందుకే విదేశీ పర్యటనకు వెళ్లామని చెప్పారు. ‘‘మేం ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ కోసం విదేశీ పర్యటనకు వెళ్లలేదు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ సంస్థలకు నమ్మకం కలిగించేందుకే అమెరికా, సౌత్ కొరియాకు వెళ్లాం. పెట్టుబడులపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి.

పచ్చ కామెర్ల వాళ్లకు అంతా పచ్చగానే కనిపిస్తుంది” అని మండిపడ్డారు. శనివారం సెక్రటేరియెట్​లో మీడియాతో శ్రీధర్​బాబు మాట్లాడారు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో రూ.31,500  కోట్ల పెట్టుబడుల కోసం 19 ఎంవోయూలు కుదుర్చుకున్నామని ఆయన వెల్లడించారు. వీటి వల్ల 30 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ‘‘రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలనేదే మా లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.

పెట్టుబడులకు రాష్ట్రంలో మంచి వాతావరణం ఉందని వివరించేందుకు విదేశాలకు వెళ్లాం. రాబోయే 20 ఏండ్ల పాటు ప్రభుత్వ లక్ష్యం, గమ్యం ఏమిటో పలు సంస్థలకు వివరించాం. అనేక కంపెనీలతో చర్చలు జరిపాం. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు. 

అమెరికాకు తెలంగాణ సీఎం వెళ్లడం ఫస్ట్ టైమ్.. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం అమెరికాకు సీఎం వెళ్లడం ఇదే మొదటిసారి అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ ఘనత రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు. ‘‘గతంలో కేసీఆర్ 15 రోజులు చైనా టూర్ కు వెళ్లారు. రూ.వెయ్యి కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. కానీ అందులో రూ.200 కోట్లు కూడా రాలేదు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇస్తామన్నది కూడా కేవలం పేపర్ల వరకే పరిమితమైంది” అని విమర్శించారు. తమ విదేశీ పర్యటనలో ఏఐ, స్కిల్ యూనివర్సిటీ, మూసీ నది అభివృద్ధిపై పలువురితో చర్చలు జరిపామని తెలిపారు.

ఇప్పటికే కాగ్నిజెంట్, ఆర్అండ్ డీ సంస్థలు హైదరాబాద్​లో తమ సేవలను విస్తరిస్తున్నాయని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్నింగ్ వంటి సంస్థలు తెలంగాణను విడిచి పోతున్నాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కార్నింగ్ సంస్థతో చర్చలు జరిపాం. వాళ్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో అమెజాన్ లాంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. దక్షిణ కొరియాలో దాదాపు 12 సంస్థలతో చర్చలు జరిపాం.

మూసీ పునరుజ్జీవంపై అధ్యయనం చేశాం. ఏఐ, సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపాం. ప్రపంచబ్యాంక్‌‌‌‌ అధ్యక్షుడు అజయ్‌‌‌‌ బంగాతోనూ భేటీ అయ్యాం. జీనోమ్‌‌‌‌ వ్యాలీలో ఫాల్కనెక్స్‌‌‌‌ కంపెనీ విస్తరణకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో మెగా ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ డీ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని హ్యుందాయ్‌‌‌‌ కంపెనీ తెలిపింది” అని వివరించారు. ఎల్‌‌‌‌ఈడీ స్క్రీన్ల ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేస్తామని సీటెక్‌‌‌‌ సంస్థ చెప్పిందని వెల్లడించారు. 

ఫ్యాషన్ సిటీ ఏర్పాటుకు పదెకరాలు.. 

దక్షిణ కొరియాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీ మాదిరి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘‘మేం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శించాం. ఇది అత్యంత విజయవంతమైన ప్రాజెక్ట్. దాని ప్రారంభం నుంచి డజన్ల కొద్దీ ఒలింపిక్ చాంపియన్‌‌‌‌లను అందించింది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో దక్షిణ కొరియా గెలుచుకున్న 33 పతకాలలో 16 పతకాలు ఈ యూనివర్సిటీ క్రీడాకారులే సాధించారు” అని చెప్పారు. ‘‘హ్యుందాయ్ మోటార్స్ మన రాష్ట్రంలో మెగా ఆటోమోటివ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.

వరంగల్ మెగా టెక్స్‌‌‌‌టైల్ పార్క్‌‌‌‌లో మల్టీ క్లాస్​ఫ్యాక్టరీలను యంగోన్  ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌‌‌‌లో ఫ్యాషన్‌‌‌‌ సిటీ ఏర్పాటు చేసేందుకు కూడా యంగోన్‌‌‌‌ ముందుకొచ్చింది. ఇందుకోసం ఎయిర్‌‌‌‌పోర్టు సమీపంలో 10 ఎకరాలను కేటాయిస్తూ యంగోన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌కు  రేవంత్​రెడ్డి లెటర్​ రాశారు. కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ తో ఎంవోయూ చేసుకున్నాం” అని వివరించారు.

స్వచ్ఛ బయోపై తప్పుడు ప్రచారం.. 

తమ విదేశీ పర్యటనలో ప్రకటించిన బయో ఇథనాల్ ప్రాజెక్ట్‌‌‌‌కు సంబంధించి దుష్ప్రచారం జరిగిందని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు . ‘‘స్వచ్ఛ బయో ఇటీవలే ఏర్పడి ఉండవచ్చు. కానీ ఇది బయోఇథనాల్ ఉత్పత్తి రంగంలో 8 పేటెంట్‌‌‌‌లను కలిగి ఉంది. రాష్ట్రంలో మల్టీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి పెద్ద ప్రణాళికలతో ముందుకొచ్చింది.

మేం ఆ కంపెనీతో చేసుకున్నది జెనరిక్ ఎంవోయూ మాత్రమే. ప్రభుత్వ భూమి, ప్రోత్సాహకాల పరంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు” అని స్పష్టం చేశారు. ‘తెలంగాణ అంటే వ్యాపారం’ అని కంపెనీలకు స్పష్టం చేశామన్నారు.