- రంగారెడ్డి కలెక్టరేట్ అవగాహన సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు
ఇబ్రహీంపట్నం, వెలుగు: అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలను, అభిప్రాయాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేసే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపికను ప్లాన్ప్రకారం చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల లిస్టును ప్రదర్శించాలన్నారు. వచ్చే ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం ఇవ్వటానికి ప్లాన్సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు అవకాశం ఇస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ నాలుగు పథకాలకు ఈ నెల 16 నుంచి 20 వరకు లబ్ధిదారులను గుర్తిస్తామని, 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ అరికెపుడి గాంధీ, ఎమ్మెల్సీ బుగ్గవరపు దయానంద్, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.