హెచ్ సీయూలో ఏనుగులా?.. ఏఐతో సృష్టించి ఆగం జేసిండ్రు: మంత్రి శ్రీధర్ బాబు

హెచ్ సీయూలో ఏనుగులా?.. ఏఐతో సృష్టించి ఆగం జేసిండ్రు: మంత్రి శ్రీధర్ బాబు
  • రాష్ట్రంలో ఏనుగుల శాతం ఎంత.?
  • ఏఐతో సృష్టించి ఆగం జేసిండ్రు
  • ఆ భూమికి ఐసీఐసీఐ లోన్ ఇవ్వలే
  • సుప్రీం తీర్పు తర్వాత భూమిపై కేసుల్లేవ్
  • కేటీఆర్ వి అన్నీ తప్పుడు ఆరోపణలే
  • గాంధీ భవన్ లో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్:  హెచ్సీయూ భూమిలో ఏనుగులు ఉన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో  బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని, రాష్ట్రంలో ఉన్న ఏనుగుల శాతం ఎంత..? అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రశ్నించారు.  ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 10 వేల కోట్ల రుణం తీసుకొచ్చారని, కేటీఆర్  ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇంత వరకు తాము ఆ భూమిపై ఎలాంటి అప్పూ తీసుకోలేదని అన్నారు. ఆ  భూమి లిటిగేషన్ ల్యాండ్ అని అంటున్నారని, సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చిందని, దానిపై ఎలాంటి వ్యాజ్యాలు లేవని క్లారిటీ ఇచ్చారు. 

సెబీ నిబంధనల ప్రకారమే బాండ్లు జారీ చేశామని, ప్రభుత్వం ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని అన్నారు. బాండ్ అనేది పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్ అని, టీజీఐఐసీ అన్ని నిబంధనలూ పాటిస్తూ లావాదేవీలు జరిపిందని చెప్పారు. నాన్ కన్వర్టబుల్ రిడీమెబుల్ డిబెంచర్లను జారీ చేసిందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. లోన్ లేనప్పుడు బ్రోకర్ ఎక్కడి  నుంచి వచ్చారని ప్రశ్నించారు.  ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, ఫ్యూచర్  సిటీ ముందుకు తీసుకెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని చెప్పారు. 9 ఏండ్ల క్రితం రాజస్థాన్ లో చనిపోయిన జింక పిల్ల హెచ్ సీయూలో చనిపోయినట్టు ఫోటోలు వైరల్ చేశారని అన్నారు. 

తాము బాధ్యతా యుతంగా మూసీ ప్రక్షాళన చేపట్టామని, ప్రజలకు మంచి గాలి, నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అభివృద్ధిని ఓర్వలేకనే రకరకాల వివాదాలు సృష్టిస్తూ.. సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం సృష్టించి ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.