![చిలుకూరు ఆలయం వద్ద భద్రత పెంచండి: మంత్రి శ్రీధర్‌బాబు](https://static.v6velugu.com/uploads/2025/02/minister-sreedhar-babu-comments-on-chilukur-balaji-temple-secur_OxXr0CvUbR.jpg)
- పోలీసులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం
చేవెళ్ల, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద భద్రత పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. రెండు రోజుల కింద కొంతమంది చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి చేయగా, మంగళవారం ప్రభుత్వ చీఫ్విప్పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సౌందర రాజన్‌ను కలిసి రంగరాజన్ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
మంత్రి మాట్లాడుతూ రామరాజ్యం పేరిట అరాచకం చేస్తే సహించేది లేదన్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. చిలుకూరు ఆలయం వద్ద సెక్యూరిటీ పెంచాలని పోలీసులను ఆదేశించారు. దాడి చేసిన నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రి గుర్తుచేశారు.
దాడి అప్రజాస్వామికం: జాన్‌వెస్లీ
రామరాజ్య ముసుగులో అర్చకులపై దాడులు చేయడం ఆప్రజాస్వామ్యమని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం ఆయన చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ ను ఆయన ఇంట్లో కలిసి పరామర్శించారు. తర్వాత మాట్లాడుతూ రంగరాజన్ గారు లౌకికవాది, ప్రజాస్వామ్యవాది పరమత సహనం కలిగిన వ్యక్తి అన్నారు.