- అవగాహనతో ఈ నేరాలను అరికట్టాలి
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో మంచి ఫలితాలు ఇస్తున్నదని వెల్లడి
- సైబర్ థ్రెట్స్ అండ్ సొల్యూషన్స్‌పై సోమాజిగూడలో సదస్సు
హైదరాబాద్,వెలుగు: సైబర్ నేరాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీతో పెగిరిపోతున్న సైబర్ నేరాలు, థ్రెట్స్‌పై హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడలోని ది పార్క్‌లో హైదరాబాద్ ఆన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమిట్–2.O(హెచ్‌ఏసీకే) జరిగింది.
ఈ సదుస్సులో మంత్రి శ్రీధర్‌బాబు, సినీ నటుడు అడవి శేషు, మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ బ్రిజేశ్ సింగ్, రాష్ట్ర సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు, ఐటీ నిపుణులు పాల్గొన్నారు. సీటీ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన ప్యానల్ డిస్కషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను అవగాహనతో అరికట్టాలని సూచించారు.
రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో మంచి ఫలితాలను ఇస్తున్నదని పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ రియల్ గ్లోబల్ సైబర్ సిటీగా రూపొందుతన్నదని తెలిపారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం సైబర్ సెక్యూరిటీపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్‌ను శ్రీధర్‌బాబు విడుదల చేశారు.
హెల్త్ డాటా థెఫ్ట్ వల్ల ‘బయోవెపన్స్’కు అవకాశం..
సమిట్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై చర్చించారు. ప్యానల్‌లో సైబర్ సెక్యూరిటీ కన్సల్టింగ్ కృష్ణ శాస్త్రీ, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు ఈశ్వర సాయి ప్రసాద్, ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అంబుడ్స్‌మెన్ నిన్మయ్ కుమార్ పాల్గొన్నారు. ఆన్‌లైన్ దోపిడీ, డిజిటల్ అరెస్ట్‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.హెల్త్ డాటా థెఫ్ట్ వల్ల రానున్న రోజుల్లో బయోవెపన్స్‌కి దారి తీసే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
చైనా, రష్యాలాంటి దేశాలతో పాటు టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన చాలా దేశాల నుంచి హ్యాకర్లు దాడులు చేస్తున్నారని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు జరిగిన సెషన్స్‌లో ఐటీ ప్రముఖులు, సైబర్ క్రైమ్ పోలీసులు, నిపుణులు సైబర్ సెక్యూరిటీపై ప్యానల్ డిస్కషన్ చేశారు.
తెలియని నంబర్స్ నుంచి కాల్స్, లింక్స్ వస్తే స్పందించొద్దు: అడవి శేష్
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని నంబర్స్ నుంచి కాల్స్, లింక్స్ వస్తే స్పందించకూడదు. స్కాం అని అనుమానం వస్తే జాగ్రత్త పడాలి. క్రిప్టో, బిట్ కాయిన్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటిపట్ల నేను దూరంగా ఉంటాను. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు, కమీషన్స్ ఆశచూపితే మోసం అని గుర్తించాలి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
అన్ని ఇండస్ట్రీస్‌కి అవగాహన కలిపిస్తున్నం: శిఖా గోయల్
సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోతున్న డబ్బు వివిధ రాష్ట్రాల్లో అకౌంట్స్‌లోకి వెళ్తున్నది. చివరికి క్రిప్టో, బిట్‌కాయిన్స్ ద్వారా దేశాలు దాటిపోతున్నది. నేరాలను నియంత్రించడంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో మంచి ఫలితాలను ఇస్తున్నది. ఐటీ కంపెనీలు సహా అన్ని ఇండస్ట్రీస్‌కి సైబర్ సెక్యూరిటీపై అవగాహన కలిగిస్తున్నాం. జాగురుక్ సీనియర్ సిటీజన్ దివాస్ పేరుతో అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
ఈ ఏడాది 24 శాతం పెరిగిన సైబర్ నేరాలు: సిటీ సీపీ సీవీ ఆనంద్
ఈ సంవత్సరం సైబర్ నేరాలు 24 శాతం పెరిగాయి. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించాం. ఇందులో డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఫ్రాడ్స్ సహా 25 నేరాలు నిరంతరం రిపోర్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్‌లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో కూర్చుని సైబర్ నేరాలు చేస్తున్నారు. ఇలాంటి నేరాల్లో ఉన్నత విద్యావంతులే ఎక్కువగా మోసపోతున్నారు. బాధితులు కోల్పోయిన డబ్బులో ఈ ఏడాది రూ.35.8 కోట్లు తిరిగి అప్పగించాం.