![టైర్ 2,3 నగరాలకూ ఐటీ విస్తరిస్తం:శ్రీధర్ బాబు](https://static.v6velugu.com/uploads/2025/02/minister-sreedhar-babu-comments-on-it-development_O4fRhnuZg3.jpg)
- గ్రామీణ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు
- ఐటీ పరిశ్రమలకు 2016 నుంచి 4,500 కోట్ల సబ్సిడీ పెండింగ్
- ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నం
- పరిశ్రమలకు కేటాయించిన భూముల అన్యాక్రాంతం
- లెక్కలు తీస్తున్నం.. కమిటీ నివేదిక వచ్చాక చర్యలు
- ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్: రాష్ట్రంలోని టైర్ 2,3 నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఐటీ పరిశ్రమలు కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ఉన్న వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఐటీ పరిశ్రమలకు ఇవ్వాల్సిన 4,500 కోట్ల సబ్సిడీని 2016 నుంచి పెండింగ్ లో పెట్టిందన్నారు. ఆ బకాయిలను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి పలువురు పరిశ్రమల స్థాపన కోసం భూములు పొందారని, ఆ ఇండస్ట్రీ స్థాపించారా..? లేదా..? అన్న అంశంపై లెక్కలు తీస్తున్నామని చెప్పారు.
చాలా చోట్ల పరిశ్రమల కోసం కేటాయించిన భూములు అన్యాక్రాంతమైనట్టు తెలుస్తోందని, దీనిపై వేసిన కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లో పెట్టుబడుల పెట్టేందుకు అనేక బహుళజాతి సంస్థలు ముందుకు రావడం, ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. రెండు అమెరికన్ బేస్డ్ కంపెనీలకు కేవలం 9 దేశాల్లోనే కార్యాలయాలున్నాయని, వారు హైదరాబాద్ లో ఆఫీసు ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ కంపెనీల్లో ఈ సంవత్సరం 500 మందికి, రెండేళ్లలో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ కంపెనీలు డ్రోన్స్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ రెడీ చేస్తాయని అన్నారు.
ALSO READ | నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్!
సెంటిలియన్ కంపెనీ సీఈవో వెంకట్ మాట్లాడుతూ.. కరీంనగర్ లో తాము కంపెనీ ఏర్పాటు చేశామని, ఫ్లైట్ ట్రాకింగ్ త్రీడీ రిక్రియేట్ విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. కరీంనగర్, హైదరాబాద్ లలో ఆఫీసులు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. రాబోయే మూడేండ్లలో రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.