- మరో 12 మున్సిపాలిటీలు కూడా..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మహబూబ్ నగర్, మంచిర్యాలను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిని పెంచుతూ, అందులో కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తున్నట్టు చెప్పింది. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గురువారం ప్రకటించారు. తెలంగాణ మున్సిపాలిటీస్ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లులపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో కొత్తగా 12 కొత్త మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీధర్ బాబు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కోహీర్, గుమ్మడిదల, గడ్డ పోతారం, ఇస్నాపూర్, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మొయినాబాద్, కొడంగల్ నియోజకవర్గంలో మద్దూర్, మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర, వరంగల్ జిల్లాలో కేసముద్రం, స్టేషన్ ఘన్ పూర్, కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలో ఏదులాపురంను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, తాము లేవనెత్తిన పలు అంశాలపై మంత్రి సరైన సమాధానం ఇవ్వలేదని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు.
ప్రజల సంక్షేమం కోసమే హైడ్రా..
ప్రజాసంక్షేమం కోసమే హైడ్రా పనిచేస్తున్నదని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజల ఆస్తులు, చెరువులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ‘‘అర్బనైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాలు రూపాంతరం చెందుతున్నాయి. చాలా గ్రామాల్లో జనాభా పెరుగుతున్నది. వ్యవసాయంపై ఆధారపడే వారి సంఖ్య తగ్గుతూ.. పరిశ్రమలపై ఆధారపడే వారి సంఖ్య పెరుగుతున్నది. అందుకే గ్రామాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తున్నం” అని వెల్లడించారు.
111 జీవో అంశం కోర్టు పరిధిలో ఉందని, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు రెండు పర్యాయాలు ఉంటాయని గతంలో ఉన్న నిబంధనను తొలగించామని.. మేయర్, చైర్మన్ పోస్టులకు ప్రతి ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు.
ఓఆర్ఆర్ పరిధిలో 51 పంచాయతీలు విలీనం: సీతక్క
ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామ పంచాయతీలను వాటికి దగ్గర్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ పట్టణాలకు దగ్గరగా ఉన్న 80 గ్రామ పంచాయతీలతో కొత్త మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించిన సవరణను ప్రస్తుత బిల్లులో పెట్టామన్నారు.