సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ జీసీసీ షురూ

సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ జీసీసీ షురూ
  • ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు 

హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన ఆర్థిక సంస్థ  సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ మంగళవారం గ్లోబల్ టెక్నాలజీ  ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అయిన కాగ్నిజెంట్‌‌‌‌‌‌‌‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది.  సిటిజన్స్​ డిజిటల్ ట్రాన్స్​ఫర్మేషన్​, టెక్నాలజీ మోడర్నైజేషన్​కు ఇది కీలకమని తెలిపింది. ఈ కేంద్రంలో  2026 మార్చి నాటికి ఐటీ, డేటా, అనలిటిక్స్ నిపుణుల సంఖ్య  వెయ్యికి చేరుకుంటుందని సిటిజె న్స్​పేర్కొంది.  ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌లను బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను జీసీసీ హబ్ నుంచి గ్లోబల్ వాల్యూ సెంటర్‌‌‌‌‌‌‌‌గా మార్చాలనుకుంటున్నామని అన్నారు. రాబోయే దశాబ్దంలో జాతీయ జీడీపీకి ట్రిలియన్​ డాలర్లను అందించే మొదటి భారతీయ రాష్ట్రంగా తెలంగాణను మార్చడమే లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ లో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల "గ్రేడ్ ఏ" కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.  

నగరం  గ్లోబల్ బిజినెస్ హబ్​గా మారిందని అన్నారు.  హైదరాబాద్ లో ఆమ్జెన్, గ్లోబల్ లాజిక్, ఎలీ లిల్లీ, మారియంట్, సిగ్నా లాంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన 355 జీసీసీలు ఉన్నాయని, ఇవి మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పారు. ఏడాదిలోనే 70 కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యాయని మంత్రి అన్నారు.   దాదాపు వారానికి ఒకటి ఏర్పాటయిందన్నారు.