హైదరాబాద్, వెలుగు: డిజిటల్ ఇంజినీరింగ్ సేవలు అందించే హిటాచీ గ్రూప్ కంపెనీ గ్లోబల్‌లాజిక్ మంగళవారం హైదరాబాద్‌లో కొత్త డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. రాష్ట్ర, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు దీనిని ఆరంభించారు. ఈ కేంద్రం 600 మంది ఇంజనీర్లతో ప్రారంభమవుతుందని, మూడేళ్లలో వీరి సంఖ్యను రెండు వేలకు పెంచుతామని ప్రకటించింది. మహబూబ్‌నగర్‌లోనూ తమకు సెంటర్ ఉందని, చిన్న నగరాలకు మరింత విస్తరిస్తామని గ్లోబల్‌లాజిక్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ హెడ్ పీయూష్ ఝా చెప్పారు. గ్లోబల్‌లాజిక్ తన విస్తృతమైన సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించి, వివిధ రంగాలలోని కంపెనీలకు డిజిటల్ ఉత్పత్తులు, సేవలను అందిస్తుందని పేర్కొన్నారు.
నాలుగైదు నెలల్లో ఏఐ సిటీ
రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా చెప్పారు. మరో నాలుగైదు నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో ఏఐ సిటీని నిర్మిస్తామని తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్‌లో అనుకూల వాతావరణం ఉందన్నారు. ఎంఎన్సీలకే కాకుండా ఎంఎస్ఎంఈలకూ ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు12 శాతానికి పెరిగాయని, మరో ఐదేండ్లలో 20 శాతానికి చేరుతాయన్నారు. చిన్న పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. మలేసియాలోని తెలుగు వాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నెల 18న ఏఐ హెల్త్‌కేర్ సమిట్‌ను నిర్వహించనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.