రైతును రాజు చేయడమే మా లక్ష్యం

రైతును రాజు చేయడమే మా లక్ష్యం
  • ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే
  • మంత్రులు శ్రీధర్‌‌‌‌ బాబు, తుమ్మల, పొన్నం
  • ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోబోమని వెల్లడి 
  • పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

పెద్దపల్లి, వెలుగు: వరంగల్ రైతు డిక్లరేషన్‌‌లో కాంగ్రెస్‌‌ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు పేర్కొన్నారు. రైతును రాజును చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, వారి విమర్శలను పట్టించుకోబోమని వారు స్పష్టం చేశారు.

శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్​సింగ్ శంకుస్థాపన చేశారు. ఓదెల మండలం కొలనూర్‌‌‌‌లో నిర్మించిన పీహెచ్‌‌సీని ప్రారంభించారు.

అలాగే, రూ.13.30 కోట్లతో నిర్మించనున్న పెద్దపల్లి నుంచి కొత్తపల్లి, కొలనూర్ మీదుగా ఓదెల వరకు నిర్మించే రోడ్‌‌కు, కాల్వ శ్రీరాంపూర్​ మండలం పెదరాతిపల్లిలో నిర్మించ తలపెట్టిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీరాంపూర్‌‌‌‌లో ఫంక్షన్ హాల్‌‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. 

ప్రజల మేనిఫెస్టో రూపొందించారు: తుమ్మల

ప్రజల ఇబ్బందులు తెలుసుకొని మంత్రి శ్రీధర్‌‌‌‌ బాబు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేర్చారని , దాని ప్రకారమే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఆయిల్ ఫామ్ సాగు చేస్తే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాకాలు అందిస్తుందని తెలిపారు. దేశంలో ఆయిల్ ఫామ్ సాగులో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయన్నారు.పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తన పార్లమెంటు నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలన్నారు. 

వ్యవసాయంపై బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌ చిన్న చూపు: ఎంపీ వంశీకృష్ణ

వ్యవసాయాన్ని బీఆర్‌‌‌‌ఎస్, బీజేపీ చిన్న చూపు చూశాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్​రెడ్డిదేనన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంతో పెద్దపల్లి జిల్లా రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌‌ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని, ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్​రెడ్డి రైతు రుణమాఫీ చేసారన్నారు. 

హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నం: శ్రీధర్‌‌‌‌ బాబు

ఉచిత బస్సు పథకంతో 62 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో రూ.లక్ష లోపు రుణమాఫీ చేశామని, మరో 15 రోజుల్లో రూ.1.50 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. రూ.170 కోట్లతో పెద్దరాతిపల్లిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రూ.లక్ష రుణమాఫీని నాలుగైదు విడుతల్లో ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే రోజు రూ.లక్ష లోపు రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గోదావరిఖని, మంథని బస్ డిపోలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు.