కేంద్ర మంత్రి కుమార స్వామికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

కేంద్ర మంత్రి కుమార స్వామికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ఆదిలాబాద్ సిమెంటు ఫ్యాక్టరీని పునరుద్ధరించి.. స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్​డీ కుమారస్వామిని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం.. బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్​తో కలిసి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సిమెంటు ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 2,290 ఎకరాల భూమిని ఉచితంగా అందజేసిందని గుర్తుచేశారు. అందువల్ల ఈ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నందున కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీస్​ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో రాష్ట్రం ముందుందని, ఇక్కడ భూములు, నీరు, విద్యుత్తు అవసరాల మేరకు అందుబాటులో ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ స్థాయిల్లో స్కిల్డ్ మ్యాన్ పవర్ సమృద్ధిగా ఉందని వివరించారు. 

రాష్ట్రాన్ని సందర్శించి ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్ యూ)లకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను వెనక్కి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కింద విక్రయించాలని నిర్ణయించినందున.. వీటి మిగులు భూములను తిరిగి అప్పగించాలని కోరారు.