పెద్దపల్లి/రామగిరి, వెలుగు: సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పటికే కార్మికుల ప్రమాద బీమాను రూ.కోటికి పెంచామన్నారు. రామగిరి మండలంతో పాటు మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గురువారం ప్రచారం చేశారు. ఉదయం రామగిరి మండలం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ 2లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని మంత్రి పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి తెలిపారు. గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సింగరేణికి పూర్వ వైభవం తెస్తం: వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే కేంద్రంలో కార్మికుల గొంతుకనైతానని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. తన తాత వెంకటస్వామి కార్మికుల పక్షాన పోరాటాలు చేశారని, ఆయన వారసుడిగా సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానన్నారు. కోల్ బెల్ట్ ఏరియాలో కార్మిక కారిడార్ ఏర్పాటుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. లక్ష మంది కార్మికులతో కళకళలాడిన సింగరేణిలో ఇప్పుడు కేవలం 35 వేల పైచిలుకు మంది కార్మికులతో కళావిహీనంగా మారిందన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త గనులు ఏర్పాటు చేయించి సింగరేణికి పూర్వవైభవం తెస్తానని తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ రత్నాపూర్లో ఉపాధి హామీ కూలీలను కలిసి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీలకు కలిగే లబ్ధి గురించి వివరించారు. ఆ తర్వాత మంథనిలో సీపీఎం నాయకులను కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం నాయకులు ప్రకటించారు. అలాగే, మంథని బార్అసోసియేషన్లో అడ్వకేట్లతో సమావేశమయ్యారు. వంశీకృష్ణ గెలుపునకు కృషి చేస్తామని వారు తెలిపారు. అడ్వకేట్ల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని మంత్రి శ్రీధర్‌బాబు వారికి హామీ ఇచ్చారు.