- కౌన్సిల్ 28.3 గంటలు పని చేసింది: శ్రీధర్ బాబు
- కాంగ్రెస్ సభ్యులు మాట్లాడిన టైం 6.23 గంటలు
- బీఆర్ఎస్కు 5.06 గంటలు
- బీజేపీకి 3.20.. ఎంఐఎంకు 3.39, సీపీఐకి 1.56 గంటల సమయం
హైదరాబాద్, వెలుగు: ఏడు రోజుల పాటు సాగిన శాసన సభ, శాసన మండలి సమావేశాల్లో అసెంబ్లీ 37 గంటల 44 నిమిషాల పాటు, కౌన్సిల్ 28 గంటల 3 నిమిషాల పాటు నడిచాయని శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎల్పీలో మీడియాతో మంత్రి మాట్లాడారు. అసెంబ్లీలో 71 మంది సభ్యులు మాట్లాడారని, 8 బిల్లులను సభ ఆమోదించిందని చెప్పారు. మండలిలో సభ్యులు 38 ప్రశ్నలు అడిగారన్నారు.
సభలో అధికార కాంగ్రెస్ సభ్యులు 6 గంటల 23 నిమిషాలు మాట్లాడగా, బీఆర్ఎస్ సభ్యులు 5 గంటల 6 నిమిషాలు, బీజేపీ సభ్యులు3 గంటల 20 నిమిషాలు, ఎంఐఎం సభ్యులు3 గంటల 39 నిమిషాలు, సీపీఐ సభ్యుడు1 గంట 56 నిమిషాలు సభలో మాట్లాడారని మంత్రి వివరించారు. ఇక మంత్రులు సభలో వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ17 గంటల 20 నిమిషాలు మాట్లాడారని తెలిపారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో సభను నడిపాం..
అసెంబ్లీ సమావేశాలను పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహించామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూనే సభలో ముందుకు వెళ్లామన్నారు. ‘‘ప్రతిపక్షం కోరగానే గురుకులాలపై చర్చకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. హైడ్రాపై ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేసింది. మూసీ బాధితులకు అన్యాయం జరగనివ్వబోమని భరోసా ఇచ్చాం” అని మంత్రి వెల్లడించారు. తాము పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో సభను నడిపితే.. ప్రతిపక్ష సభ్యులు మాత్రం సభను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు.
మా చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం..
సమావేశాల విషయంలో తాము ఎక్కడా పారిపోలేదని శ్రీధర్ బాబు చెప్పారు. శిక్షణా తరగతులకు రాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పారిపోయారన్నారు. దీనితోనే అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ పై ఆ పార్టీకి ఉన్న గౌరవం ఏపాటిదో తేలిపోయిందన్నారు. తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా సభను నడిపామని, తమ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. షార్ట్ డిస్కషన్ లో గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, టూరిజం పాలసీ, రైతు భరోసా అంశాలపై చర్చించామని, తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం స్పష్టత ఇచ్చారని చెప్పారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి గత ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదని, ఆ పనిని తాము చేశామన్నారు. అసెంబ్లీలో తెలంగాణ భూభారతి చట్టాన్ని ఆమోదింపచేసి, తమ మాటల్లోని చిత్తశుద్ధిని చాటుకున్నామని శ్రీధర్ బాబు చెప్పారు.