- భూమి లేకపోయినా 17 మంది ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలను రెచ్చగొట్టిన్రు: మంత్రి శ్రీధర్ బాబు
- సమస్యలపై చర్చించకుండా బీఆర్‌ఎస్ వాళ్లు సభను అడ్డుకుంటున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటనలో అమాయక రైతులను అడ్డం పెట్టుకొని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగుతున్నారని, వారికి సభ నడవడం ఇష్టం లేదని అసెంబ్లీ వ్యవహారాలు, ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లగచర్ల ఘటనలో 17 మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ప్రత్యక్షంగా సంబంధం ఉందని, వారికి భూమి లేకున్నా అక్కడికెళ్లి ప్రజలను రెచ్చగొట్టారన్నారు. బీఆర్‌ఎస్ నేతలు చేసిన పనికి అమాయక రైతులు బలయ్యారని మండిపడ్డారు.
మంగళవారం అసెంబ్లీ లంచ్ బ్రేక్ తర్వాత సభ ప్రారంభమయ్యాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడం.. సభను జరగనివ్వకపోవడంతో శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే స్పీకర్ ఈ విషయం చెప్పినా వినిపించుకోకుండా ఆందోళన చేయడం మంచిది కాదని సూచించారు. వారికి మీడియాలో కనిపించడమే ముఖ్యమని, అందుకే ఆందోళనలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు, ప్రజలకు మంచి జరిగే అంశాలపై చర్చించే ఉద్దేశం వారికి లేదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ, రైతులకు పరిహారంపై చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఏసీలో డిస్కస్ చేసిన ప్రజలకు సంబంధించిన 17 అంశాలపై సభలో చర్చించాలన్నారు. యువతకు అవసరమైన స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి అంశాలపై చర్చించకుండా సభను అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆరు గ్యారంటీలపై బీజేపీ నేతలు వారి వారి నియోజకవర్గాలకు వెళ్లి ఎంక్వైరీ చేసుకుంటే ప్రజలే సమాధానం చెబుతారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేశామని, బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారని ఆయన ప్రశ్నించారు.