- అందుకే ఆయనకు హైకమాండ్టికెట్ ఇచ్చింది
పెద్దపల్లి, వెలుగు: గడ్డం వంశీకృష్ణ సత్తా ఉన్న నాయకుడని, ప్రజా సేవలో ఉన్నారని, అందుకే ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. భారీ మెజార్టీతో వంశీని ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ఎంపీగా వివేక్ వెంకటస్వామి తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్లో ఎలా పోరాడారో ప్రజలకు తెలుసని చెప్పారు. అలాగే, కాకా ఫ్యామిలీ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, అలాంటి ఫ్యామిలీ గురించి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో వంశీ ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలా ఆలోచించి, వంశీని బరిలో నిలిపిందని, ఆయన గెలిస్తేఈ ప్రాంతానికి న్యాయం చేస్తాడని తాను నమ్ముతున్నట్టు చెప్పారు.
బీజేపీ 2000 సంవత్సరంలో రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన చేసిందని చెప్తే సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నదని మండిపడ్డారు. ఐదు గ్యారెంటీలు పొందుతున్నవారు కాంగ్రెస్‌కు తప్పకుండా ఓటేస్తారని చెప్పారు ఎలక్షన్ కోడ్ ముగిశాక అర్హులకు ఇండ్లు కట్టించి, ఇస్తామన్నారు. వంశీ గెలిచాక..నీతివంతమైన పాలన అందిస్తామని, వంశీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతా: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామివంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో ఈ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడుతానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో దోచుకున్నదని మండిపడ్డారు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నదని చెప్పారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ క్లియర్ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు. రాహుల్ గాంధీ రూపొందించిన పాంచ్ న్యాయ్ స్కీమ్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.