కంచగచ్చిబౌలి భూములపై తప్పుడు కథనాలు : మంత్రి శ్రీధర్​ బాబు

కంచగచ్చిబౌలి భూములపై తప్పుడు కథనాలు :  మంత్రి శ్రీధర్​ బాబు
  • అక్కడ పీకాక్, బఫెలో లేక్ లు లేవు: మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమిపై తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆ భూమిని 2003లో క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్​ లిమిటెడ్​కు కేటాయించిందని, కానీ, ఐఎంజీ ప్రాజెక్ట్​ను ప్రారంభించకపోవడంతో 2006లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం నిబంధలన ఉల్లంఘన జరిగినట్టు గుర్తించి కేటాయింపును రద్దు చేసిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల భూమిలో బఫెలో లేదా పీకాక్​ లేక్ వంటి ప్రకృతి ప్రాంతాలు ఏవీ లేవని రెవెన్యూ శాఖ స్పష్టం చేసిందన్నారు. ఆ భూమిలోని రాతి నిర్మాణాలు, పుట్టగొడుగు ఆకారంలోని రాళ్లను గ్రీన్​ జోన్​గా ఏర్పాటు చేస్తామని టీజీఐఐసీ ప్రకటించిందన్నారు. అందుకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ ప్రణాళికనూ సిద్ధం చేసి అమలు చేస్తుందన్నారు. హెచ్​సీయూ భూములనూ ఆక్రమించలేదని మంత్రి శ్రీధర్ బాబు  స్పష్టం చేశారు.