
- గత పదేండ్లలో ఈ రెండు పార్టీలు ప్రజలను వంచించాయి
- ప్రజా సేవ చేయాలనే లక్ష్యం ఉన్న యువకుడు వంశీకృష్ణ
- ఆయన 2 లక్షల మెజారిటీతో పెద్దపల్లి ఎంపీగా గెలుస్తారని వెల్లడి
పెద్దపల్లి, వెలుగు: గత పదేండ్ల పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ప్రోత్సహించి.. అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, మరోవైపు దేశంలో యువతకు ఉద్యోగాలిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యం ఉన్న యువకుడు గడ్డం వంశీకృష్ణను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిందన్నారు. మే 13న జరిగే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ 2 లక్షల మెజారిటీతో గెలుస్తున్నారని పేర్కొన్నారు. గురువారం ధర్మపురిలో స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన పార్లమెంటు స్థాయి పార్టీ సమావేశం జరిగింది.
ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్రావు, వివేక్ వెంకట స్వామి, గడ్డం వినోద్, విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సీనియర్ నాయకుడు జువ్వాడి నర్సింగ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, వంశీని గెలిపించే బాధ్యత ఈ ప్రాంతానికి చెందిన తమ ఏడుగురు ఎమ్మెల్యేలదేనన్నారు. వంశీకి తాత, తండ్రి ఆశీస్సులు ఉన్నా సొంతంగా పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎదిగారని, ఆయన ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తారన్న నమ్మకముందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గతంలో అనేక అరాచకాలకు పాల్పడ్డారని శ్రీధర్ బాబు ఆరోపించారు. పెద్దపల్లి పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు నీటిని తరలించుకెళ్లినా ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో గోదావరిపై ఏర్పాటు చేసిన లిఫ్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
రాబోయే రోజుల్లో చివరి భూములకు నీరందించేందుకు పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని తెలిపారు. శ్రీరామ నవమికి అందరం రాముడికి పూజలు చేశాం కానీ.. బీజేపీ ఒక్క రాముడినే పట్టుకొని పోతుందని.. అలాగైతే తిండి ఎవరు పెట్టాలి, ఉద్యోగాలు ఎవరియ్యాలని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఏటా 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా మీ సేవలో ఉంటా: వంశీకృష్ణ
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా పెద్దపల్లి ప్రజలకు సేవకుడిగా ఉంటానని పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో వేధింపులకు గురయ్యారని, అయినా పార్టీకి కట్టుబడి ఉన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని ఆనాడు కాకా వెంకటస్వామి నమ్మారని, కానీ తెలంగాణ వచ్చినా కూడా దోపిడీ కొనసాగిందన్నారు.
ధర్మపురితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, పదేండ్ల కింద ఇక్కడే మొదటి పబ్లిక్ స్పీచ్ ఇచ్చానని, ఇప్పుడు లోక్ సభ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానన్నారు. మీ ఇంట్లో చిన్న కొడుకుగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. యువతను బీఆర్‌ఎస్ పార్టీ మద్యానికి బానిస చేసిందని, తాను గెలిచిన తర్వాత డిగ్రీలు చేసిన వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాకా నీడలో పెరిగిన తాను ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.
వంశీ రికార్డ్ బద్దలు కొడతారు: రాజ్ ఠాకూర్
పెద్దపల్లిలో వంశీ రికార్డు బద్దలు కొడతాడని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. సింగరేణి కార్మికులను కొప్పుల ఈశ్వర్ మోసం చేశారని, నిరుపేద అయిన ఆయన రూ.కోట్లు సంపాదించారన్నారు. డిపెండెంట్ఉద్యోగాల పేరుతో బీఆర్‌ఎస్ లీడర్లు రూ.లక్షలు వసూలు చేశారని, అందుకే వారు మైన్‌ల మీదకు పోతే తరిమికొడుతున్నారన్నారు. కాంగ్రెస్క్యాడర్లో ఉత్సాహాన్ని చూస్తుంటే వంశీ ఇప్పటికే గెలిచినట్టు కనిపిస్తోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో తనను ఆదరించిన వెంకటస్వామి కుటుంబం రుణం తీసుకునే అవకాశం వచ్చిందని, వంశీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటానన్నారు. ఎమ్మెల్యే విజయ రమణరావు మాట్లాడుతూ, కొప్పుల ఈశ్వర్ కమీషన్లు తీసుకొని డబ్బులు సంపాదించుకున్నారని, అలాంటి వ్యక్తిని లక్ష్మణ్ కుమార్ ఓడించడం సామాన్య విషయం కాదన్నారు.
వంశీని గెలిపిస్తే మీలో ఒకడిగా ఉంటాడు..
వంశీ ఎంపీగా గెలిస్తే మీలో ఒకడిగా ఉంటాడు. మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అందరం కలిసి వంశీని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 15 ఎంపీ సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలవుతున్నాయి. మరో హామీని ఎన్నికల తర్వాత అమలు చేస్తాం.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం పేరిట సంపాదించిన అవినీతి సొమ్మును బీఆర్‌ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్లుగా మార్చుకుంది. కేసీఆర్ హయాంలోనే పోలీసులు సామాన్యులను కొట్టి జైళ్లలో పెట్టారు. యాక్సిడెంట్లు చేసి చంపారు. మంత్రులు పర్యటనకొస్తే హౌస్అరెస్టులు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ గ్రాఫ్ మరో 10 శాతం పడిపోయింది. నన్ను ఆదరించినట్టే వంశీని గెలిపించండి.
వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే