- మీరు రూపొందించిన రూల్స్ మీరే పాటించరా
- పదేండ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని ఏడాదిలోనే చేయమంటే ఎలా?
- రూ.4,500 కోట్లు పెండింగ్ పెట్టి.. మమ్మల్ని నిందించడమేంటి?: మంత్రి సీతక్క
- అసెంబ్లీలో ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లపై వాడీవేడి చర్చ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల నాలుగో రోజు.. బుధవారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లపై సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం చెప్పారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కలగజేసుకొని విద్యార్థుల స్కాలర్ షిప్లు పెండింగ్ లో పెట్టారని, అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తారా? ఎత్తివేస్తారా? అనేది క్లారిటీ ఇవ్వాలని కోరారు. లంచం లేకుండా బిల్లులు క్లియర్ చేయడం లేదని కామెంట్ చేశారు. ఈ కామెంట్ పై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ సభ్యుడై ఉండి సభలో ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. గతంలో 2014లో రూల్స్ రూపొందించారు. మీరే పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు.
మీరు పెట్టిన బకాయిలు కడుతున్నం: మంత్రి సీతక్క
2024–2025 లో ఓవర్సీస్ పథకం కింద మొత్తం 1,098 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సీతక్క చెప్పారు. వారికి రూ.140.74 కోట్లు చెల్లించామని, ఇంకా 104.42 కోట్లు బకాయి ఉన్నట్లు చెప్పారు. రూ.4,500 కోట్ల స్కాలర్ షిప్లు బీఆర్ఎస్ పెండింగ్ పెట్టి వెళ్లిందని, దానికి మమ్మల్ని నిందిస్తే ఎలా? అని ప్రశ్నించారు. మీరు పెట్టిన బకాయిలు మేం చెల్లిస్తున్నామని చెప్పారు.
కాగా, ఇప్పటి వరకు మొత్తం 8,723 మంది విద్యార్థులు ఎంపిక కాగా, రూ.1,396.25 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. 2024–25 ఏడాదికి ఓవర్సీస్ పథకంలో భాగంగా ఉపకార వేతనాల కోసం 3,488 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 1,310 మంది విద్యార్థులను ఎంపిక చేయాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్నదని చెప్పారు. ఈ నెలాఖరు వరకు ఎంపిక పూర్తి చేసి చెల్లింపులు చేస్తామన్నారు.
పదేండ్లు విధ్వంసం సృష్టించారు: విప్ ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు, ఈ– రేస్, మిషన్, కాకతీయ అన్నింట్లో కమీషన్లు దండుకున్నారని విప్ఆది శ్రీనివాస్ ఆరోపించారు. వేలకోట్లకు పడగలెత్తారని విమర్శించారు. వారు చేసినట్లే తాము చేస్తున్నామని అనుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని.. బీఆర్ఎస్ విధానాలు ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు.
సభలో అడ్డగోలుగా మాట్లాడొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ సభ్యులు గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వేషం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో వేషం వేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. మంగళవారం అయ్యప్ప డ్రెస్సులు వేసుకొని వచ్చారని, భక్తితో ఉంటారని అందరం అనుకున్నాం.. అయ్యప్ప డ్రెస్సులు ధరించి కూడా లొల్లిలొల్లి చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆటోలకు పన్నులు పెంచారని.. ఇప్పుడు ఆటో వాళ్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుతామని.. ఒక్కొక్కటి అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ఆపలేదని... అది ప్రాసెస్‌లో ఉందన్నారు. అది తెలుసుకోకుండా ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదన్నారు. సభలో అడ్డగోలుగా మాట్లాడొద్దంటూ మంత్రి కామెంట్ చేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని ఏడాదిలో చేయమంటే ఎలా? అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సీరియస్
బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ అయ్యారు. కొత్త సభ్యులకు మీరేం నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభ నుంచి సస్పెండ్ చేస్తానంటూ కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. అలాగే ఎమ్మెల్యే వివేకానంద చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కోరిన మేరకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా రికార్డుల నుంచి తొలగించామని తెలిపారు.