ఈవీ ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలిస్తం

ఈవీ ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలిస్తం
  • ఈటో సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్​ వెహికల్స్, లిథియం బ్యాటరీల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. ఆయా పరిశ్రమలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని, ఆ విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈవీల తయారీలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేస్తామన్నారు. శనివారం గోల్డ్​ స్టోన్​ ప్రసాద్​ ఆధ్వర్యంలో ఈటో (ఈటీఓ) ఎలక్ట్రిక్​ ఆటో వాహన సంస్థ ప్రతినిధులు సచివాలయంలో మంత్రి శ్రీధర్​బాబుతో సమావేశమయ్యారు.

ఏటా 10 వేల ఎలక్ట్రిక్​ ఆటోలను తయారు చేసేలా జడ్చర్లలో ఏర్పాటు చేసిన పరిశ్రమను మరింతగా విస్తరించాలని సంస్థ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్​ బాబు సూచించారు. ఎలక్ట్రిక్​ వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ పెరుగుతున్నదని, కాబట్టి విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు.

మహిళా ఆటో డ్రైవర్లను ప్రోత్సహించేందుకు ఈటో సంస్థ చేపట్టిన కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్​ బాబు ప్రశంసించారు. హైదరాబాద్, జిల్లా కేంద్రాల్లో మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారు సొంతంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తే ప్రోత్సాహకాలపై విధాన నిర్ణయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు.