
మద్యం పాలసీ, బెల్టుషాపులపై తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా...ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలు జరిపారని మండిపడ్డారు.ఆఖరికి చౌక ధరల షాపుల్లో కూడా మద్యం అమ్మకానికి బీఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చిన చరిత్ర ఉందన్నారు శ్రీధర్ బాబు. బెల్టుషాపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు.
తాము ఎట్టి పరిస్థితుల్లో బెల్టు షాపులను ఎంకరేజ్ చెయ్యబోమన్నారు శ్రీధర్ బాబు. ప్రభుత్వం బెల్టు షాపులు పెంచలేదన్నారు. తమ హయాంలోనే బెల్టు షాపులు తెచ్చామని ప్రశాంత్ రెడ్డి సభలో ఒప్పుకోవడం సంతోషకరమన్నారు. ఎక్సైజ్ శాఖలో లీకేజెస్ లేకుండా సర్కార్ చేపడుతుందన్నారు.
Also Read:-అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అడ్వొకేట్లు..
అంతకు ముందు మాట్లాడిన వేముల ప్రశాంత్ రెడ్డి.. కొత్త ప్రభుత్వం..కొత్త బ్రాండ్లు..కొత్త బీర్లు,కొత్త బార్లు ,కొత్త పబ్ లు ఇదేనా ప్రభుత్వ పాలసీ అని ప్రశ్నించారు. బెల్టు షాపులు తీసేయాలని డిమాండ్ చేశారు. ఆదాయ మార్గాన్ని పెంచేందుకు బెల్టు షాపులను పెంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.