హైదరాబాద్: గోబెల్స్ ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట అని.. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలకు సిగ్గురావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తోన్న దుష్ప్రాచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 22) హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక తీర్మానాలకు సీఎల్పీ ఆమోదం తెలిపింది.
పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్‌ను నియమించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు సీఎల్పీ భేటీ వివరాలను మీడియాకు వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపామన్నారు. కొత్తగా నియామకమైన పీసీసీ చీఫ్‌ను అభినందించేందుకే ఇవాళ సీఎల్పీ మీటింగ్ పెట్టామని పేర్కొన్నారు.
ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంపై భేటీ డిస్కస్ చేయడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యచరణపై చర్చించామని తెలిపారు. పార్టీ ప్రాధాన్యత అంశాలను మహేష్ గౌడ్ ప్రభుత్వానికి చెప్పారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ కూడా ఈ భేటీలో విలువైన సూచనలు ఇచ్చారని చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలపర్చేందుకు పీసీసీ చీఫ్ కు సహకరిస్తామని స్పష్టం చేశారు.