బుల్డోజర్ పాలసీని బీఆర్ఎస్ పార్టీనే అమలు చేసింది: మంత్రి శ్రీధర్ బాబు

బుల్డోజర్ పాలసీని బీఆర్ఎస్ పార్టీనే అమలు చేసింది: మంత్రి శ్రీధర్ బాబు

మూసీ నిర్వాసితులపై బీఆర్ఎస్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నదని మంత్రి శ్రీధర్​బాబు విమర్శించారు. ఈ అంశాన్ని భూతద్దంలో పెట్టి  చూపించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.  మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని, మల్లన్నసాగర్ బాధిత రైతు మల్లారెడ్డి  చితిపెట్టుకొని ఆహుతయ్యాడని గుర్తు చేశారు. భూనిర్వాసితుల చట్టం–2013ను అమలు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చిందని, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో హైకోర్టు అనేక సార్లు మొట్టికాయలు కూడా వేసిందని అన్నారు.  

భూ నిర్వాసితులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్​కు లేదని ఫైర్ అయ్యారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల పైకి, రైతు సోదరుల పైకి బుల్డోజర్లు పంపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని  శ్రీధర్ బాబు అన్నారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో.. అక్కడికే మా బుల్డోజర్లు వెళ్తున్నాయని చెప్పారు. ‘‘మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కోసం మా దామోదర రాజనర్సింహ పోరాటం చేశారు. భూ నిర్వాసితులను కలిసేందుకు గత ప్రభుత్వంలో ఉత్తమ్, భట్టి, రేవంత్ వెళ్తుంటే వారిని వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కానీ.. ప్రజాపాలనలో ప్రతిపక్షం ఎక్కడికి వెళ్లినా అనుమతులు  ఇస్తున్నం. 

ప్రతిపక్షాలను పోలీసులతో అడ్డుకోవడం లేదు” అని తెలిపారు. తాము ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెళ్తుంటే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులిచ్చి సీఎంతోపాటు  ప్రభుత్వంపైన వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని అన్నారు.  అరాచక శక్తులను బీఆర్ఎస్  ప్రోత్సహిస్తున్నదని,  ఇది అసలు రాజకీయం కాదని పేర్కొన్నారు.