- రామగుండం నుంచి మణుగూరు వరకుఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం
- గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
గోదావరిఖని, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్దేశ ప్రజలందరికి సమాన న్యాయం జరగాలని రాసిన భారత రాజ్యాంగాన్ని తిరగరాయాలని బీజేపీ చూస్తున్నదని, ఇది దేశానికి ప్రమాదకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం గోదావరిఖనిలో నిర్వహించిన ప్రెస్మీట్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఐఎన్టీయూసీ
సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్‌తో కలిసి మంత్రి మాట్లాడారు.
రాజ్యాంగాన్ని మార్చడమంటే దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బడుగు, బలహీన వర్గాలకు అందుతున్న రిజర్వేషన్లను ఎత్తివేయడమే అవుతుందని, ఇదే బీజేపీ లక్ష్యమన్నారు. భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత 1959లో ఆర్ఎస్ఎస్ వాళ్లు దాన్ని కాలబెట్టారని, దాదాపు 35 సంవత్సరాల వరకు ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌లో భారత జాతీయ జెండా ఎగురవేయలేదన్నారు. దీన్ని బట్టి రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీలకు ఏరకమైన గౌరవం ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ యువన్యాయం పేరుతో ఉన్నత చదువులు చదివిన మెరిట్స్టూడెంట్లకు ఉద్యోగం వచ్చే వరకు ఏటా రూ.లక్ష ఇచ్చే స్కీమ్‌ను మేనిఫెస్టోలో పొందుపర్చామన్నారు.
75 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే..పదేండ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగాల నుంచి తొలగించారని, దీనికి బీజేపీ లీడర్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రామగుండం నుంచి మణుగూరు వరకు తప్పకుండా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు.
సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ వంటి సంస్థలతో మాట్లాడుతున్నామని, ఆయా పరిశ్రమలకు అవసరమైన సామగ్రిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోకుండా స్థానికంగానే లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వరకు కూడా ఐటీ, హార్డ్‌వేర్ కారిడార్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.