హైదరాబాద్ అంటేనే పెట్టుబడులకు నిలయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఓ సంకల్పంతో మేం ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీమ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులను సాధించింది. మొత్తం నాలుగు రోజుల పాటు జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 16 కంపెనీలతో ఒప్పందాల ద్వారా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్శించింది తెలంగాణ.
ఈ క్రమంలో దావోస్ పర్యటన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ మంగళవారం (జనవరి 28) మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దావోస్ పర్యటనలో తెలంగాణ రైజింగ్ టీమ్ లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు సాధించిందని తెలిపారు. జ్యురిచ్, దావోస్లో జరిగిన ఒప్పందాలతో రాష్ట్రంలో 51 వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
ALSO READ | దావోస్ పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వ అతిపెద్ద విజయం: సీఎం రేవంత్ రెడ్డి
గత ఏడాది కంటే ఈ సంవత్సరం దావోస్ పర్యటనలో తెలంగాణకు నాలుగు రెట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా తీర్చిదిద్చే ప్రణాళికలో ఇది మొదటి అడుగు అని అన్నారు. అయితే ఒప్పందాలు జరిగినంత మాత్రాన విజయం సాధించినట్లు కాదని.. ఎంవోయూలు చేసుకున్న కంపెనీలన్నీ స్థాపించినప్పుడే మాకు అతిపెద్ద విజయం అని మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎవరూ విమర్శ చేసినా సలహాల లాగే తీసుకుని ముందుకు వెళ్తామని.. తెలంగాణ ప్రజలు, యువతకు మేలు చేయాలనేదే మా మొదట లక్ష్యమని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవం, యువతకు ఉపాధి కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. యువత ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్శిటీ విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.