BRS అప్పుల కుప్పగా మారిస్తే.. తిరిగి గాడిలో పెడుతున్నం: మంత్రి శ్రీధర్ బాబు

BRS అప్పుల కుప్పగా మారిస్తే.. తిరిగి గాడిలో పెడుతున్నం: మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తే.. దానిని అధిగమించుకుంటూ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం (ఫిబ్రవరి 22) పెద్దపల్లి జిల్లా మంథని, రామగిరి మండలాల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించి.. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరుఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత మైన విధానంతో 317 జీవోను తీసుకువచ్చి ఇష్టానురాజ్యంగా జోన్లను ఏర్పాటు చేశారని.. స్థానిక ఉద్యోగులు ఈ జీవో 317 వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులకు భంగం వాటిల్లకుండా రాష్ట్ర పరిధిలో కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగ బదిలీలు చేసి వారి ఇక్కట్లు తొలగించామని గుర్తు చేశారు. చదువుకున్న యువతకు ఉపాధి కల్పించాలని గోదావరిఖనిలో సింగరేణి వారి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. అలాగే పెద్దపల్లిలో ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ రంగంలో టాస్క్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేసిందని వారిని గుర్తించలేదని, కానీ మేం అధికారంలోకి రాగానే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి వారికి కూడా లాభాల్లో వాటా ప్రకటించామని పేర్కొన్నారు.

 రాష్ట్రంలో రైతులందరికీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేశాం, రైతు భరోసా, రైతు బంధు, రైతు బోనస్ పథకాలను తీసుకొని రైతులకు పెద్దపీట వేశామన్నారు. నిరుద్యోగ యువతీ యువకుల కొరకు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని గుర్తు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పట్టభద్రులందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.