ఇది కరెక్ట్ కాదు.. అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

ఇది కరెక్ట్ కాదు.. అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఓవర్సీస్ స్కాలర్ షిప్‎ల విషయంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.244 కోట్ల ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులు పెండింగ్‎లో పెట్టిందని.. మేం అధికారంలోకి వచ్చాక అందులో రూ.140 కోట్ల పెండింగ్ స్కాలర్ షిప్‎లు చెల్లించామని.. మిగిలిన వాటిని కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

 బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఇచ్చే ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధుల్లోనూ కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే ఈ ఏడాదికి సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తులపై వివరాలు ఇవ్వాలని అడిగారు. ఎమ్మెల్యే కేపీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధుల్లో కమిషన్లు తీసుకుంటున్నారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్‎లు ఎక్కడా ఆపలేదని.. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను రికార్డ్‎ల నుండి తొలగించాలని మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్‎ను కోరారు. 

ఈ మేరకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద వ్యాఖ్యలను స్పీకర్ పరిశీలించి రికార్డుల నుండి తొలగించినట్లు ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయడం సరికాదని.. సభ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని విపక్షాలకు సూచించారు. ఆటో డ్రైవర్ల గెటప్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీకి రావడంపై శ్రీధర్ బాబు స్పందిస్తూ.. అధికారం మారగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేషాలు మారుస్తున్నారని.. రోజుకో వేషంలో సభకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. 

అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ పట్టించుకోలేదని.. ఇవాళ ఆటో డ్రైవర్ల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో చేయకుండా పది నెలల్లో ఎట్లా చేయాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి.. హామీలన్నీ అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.