- బీఆర్ఎస్ నేతలకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నిరసనను సభ వెలుపల చేసుకోవాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సభలో ఎంఐఎం, బీజేపీ, సీపీఐ ఫ్లోర్ లీడర్లు మాట్లాడకుండా నిరసన తెలపడం ఏమిటని తప్పుపట్టారు. భూభారతి బిల్లులో ఏమేం ఉంటాయన్న అంశాలపై రాష్ర్ట ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ బిల్లుపై సలహాలు, సూచనలు ఇవ్వాలని బీఆర్ఎస్ ను కోరుతున్నామన్నారు.
అసెంబ్లీలో 9 అంశాలపై చర్చించాలని బీఆర్ఎస్ నేతలు బీఏసీలో చెప్పారని, కానీ వీటిలో ఒక్క అంశంపై కూడా సభలో మాట్లాడలేదన్నారు. భూభారతి బిల్లుపై అధికారులు, ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందన్నారు. ఈ బిల్లుపై మాట్లాడటానికి కొంత టైమ్ కావాలని ఇటీవల బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ ని అడిగితే టైమ్ కూడా ఇచ్చారన్నారు. ఇపుడు ఆ బిల్లుపై మాట్లాడకుండా, సలహాలు సూచనలు ఇవ్వకుండా ఆందోళనలు చేయడం ఏమిటని విమర్శించారు.