
- పరిపాలన సంస్కరణలతో ఆదాయం పెంచుకుంటామని స్పష్టం
- ఆదాయం కోసం లిక్కర్ ధరలు పెంచుతుండ్రు: ప్రశాంత్‌రెడ్డి
- కొత్త మద్యం పాలసీ విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రేషన్ షాపుల్లో లిక్కర్ అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. మంగళవారం కొత్త మద్యం పాలసీపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులో భాగంగా ఎక్సైజ్ పాలసీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లికృష్ణారావు తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు లిక్కర్ రేట్లు అడ్డగోలుగా పెంచుతోందని, కొత్త మద్యం పాలసీని వెంటనే విత్ డ్రా చేసుకోవాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులు తీసేయాలన్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే అడ్డగోలుగా మద్యం అమ్మకాలు జరిపారని ఫైర్అయ్యారు.
చివరకు రేషన్ షాపుల్లో కూడా లిక్కర్ సేల్స్‌కు పర్మిషన్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్కు ఉందన్నారు. “బెల్టు షాపులు తామే తెచ్చామని ప్రశాంత్ రెడ్డి ఒప్పుకోవడం సంతోషకరం. బెల్టు షాపులు మేం పెంచలేదు. అలాంటివి మేం ఎంకరేజ్ చెయ్యబోం. ఎక్సైజ్ శాఖలో లీకేజెస్ లేకుండా సర్కార్ చర్యలు చేపడుతుంది. అడ్మినిస్ట్రేషన్ లో సంస్కరణలు తెస్తం. దీని వల్ల రెవెన్యూ పెంచుకుంటాం’ అని అన్నారు.
గత పదేండ్ల లిక్కర్రేట్లు పెంచిందెవరు: మంత్రి జూపల్లి
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మద్యం ఆదాయాన్ని గణనీయంగా పెంచారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి అన్నారు. ఎక్సైజ్ పద్దుపై ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. ప్రతి ఏటా 40 % ఆదాయం పెరిగేలా గత ప్రభు త్వం లీక్కర్ విధానాలు అనుసరించిందన్నారు. తాము ఇతర రాష్ట్రాల నుంచి ట్యాక్స్ కట్టకుండా ఫామ్‌హౌస్‌లలో ఉపయోగించే ఇల్లీగల్ మద్యంకు ట్యాక్స్ లు పెంచామన్నారు.
రోడ్లపై మా ప్రభుత్వం చాలా ఖర్చు చేసింది: ప్రశాంత్‌రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి రూ. 8,112 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని.. అందులో రూ. 4,167 కోట్లు అప్పు తెచ్చిందని అబద్ధాలు చెప్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. తమ హయాంలో అన్ని రకాల రోడ్ల కోసం మొత్తంగా రూ.22,180 కోట్లు రిలీజ్చేశామని చెప్పారు. మా ప్రభుత్వంలో జిల్లాల్లో కలెక్టరేట్, 94 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లు, నూతన సెక్రటేరియట్, అమరవీరుల స్మారకం, యాదాద్రి దేవాలయం తదితర ఎన్నో నిర్మించామన్నారు.
ట్రిపుల్ఆర్ పై కూడా మంత్రి కోమటిరెడ్డి సభలో తప్పులు మాట్లాడారని అన్నారు. నార్త్ పార్ట్ భూసేకరణ 80శాతం, 3డీ నోటిఫికేషన్ కూడా పూర్తి చేశామని, సౌత్ పార్ట్ కు కూడా కేంద్రం సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఎకరం కూడా భూసేకరణ చేయలేదని ఆయన ఆరోపించారు.
ఓఆర్ఆర్ ను అగ్గువకు అమ్ముకున్నరు: కోమటిరెడ్డి
లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్‌ను చాలా తక్కువ ధరకు అమ్ముకున్నోళ్లుకు ట్రిపుల్ ఆర్, రాష్ట్రంలో రోడ్ల గురించి మాట్లాడే హక్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మిస్తే గత ప్రభుత్వం అగ్గువకు లీజుకు ఇచ్చి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టిందన్నారు. ట్రిపుల్ ఆర్ నార్త్ కు టెండర్లు పిలిచామని కేంద్ర కేబినెట్ ఆమోదం తరువాత టెండర్లు ఓపెన్ చేస్తారని ఏప్రిల్ లేదా మే నెలలో పనులు స్టార్ట్ అవుతాయని మంత్రి తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక రూ.6 వేల కోట్ల రోడ్ల పనులు సాంక్షన్ చేశామని తెలిపారు.