సీఎల్పీ భేటీకి అరికెపూడి గాంధీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

సీఎల్పీ భేటీకి అరికెపూడి గాంధీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హాజరు అయ్యారంటూ వస్తోన్న వార్తలపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. అరికెపూడి గాంధీ సీఎల్పీ భేటీకి రాలేదని.. కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసేందుకే వచ్చారని స్పష్టం చేశారు. సీఎల్పీ భేటీ జరిగిన హోటల్ శేరిలింగపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉందని.. అందుకే గాంధీ వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని తెలిపారు.

 సీఎం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పా అని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీ సీఎల్పీ భేటీకి వచ్చినట్లు మేము ఎక్కడ చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోందని.. గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతల అసత్య ఆరోపణలను ప్రజలను నమ్మరని అన్నారు. 

కాగా, ఇటీవల తెలంగాణ పాలిటిక్స్‎లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల వివాదం కాకరేపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి బీఆర్ఎస్‎కు రాజీనామా చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయగా..  లేదు తాను బీఆర్ఎస్‏లోనే ఉన్నానని గాంధీ అన్నారు. పీఏసీ చైర్మన్ గాంధీని నియమించడంపైన బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతోనే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానన్న గాంధీ.. ఇవాళ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కావడంతో మళ్లీ గాంధీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీంతో సీఎల్పీ భేటీకి గాంధీ హాజరయ్యారన్న దానిపై మంత్రి  శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు.