హైడ్రా విషయంలో పేదలకు ఆందోళన వద్దు: మంత్రి శ్రీధర్ బాబు

హైడ్రా విషయంలో పేదలకు ఆందోళన వద్దు: మంత్రి శ్రీధర్ బాబు

హైడ్రా విషయంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రి శ్రీధర్​బాబు భరోసా ఇచ్చారు. బిల్డర్ల చేతిలో మోసపోయిన పేదలు, మధ్యతరగతి వారి నివాసాల విషయంలో ప్రభుత్వం తొందరపడదని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ఎవరికీ అన్యాయం జరగొద్దనే ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.  హైడ్రా, మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. 

ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా.. హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. మూసీ, హైడ్రాపైన చట్టబద్ధంగా, ప్రణాళికాయుతంగా ముందుకువెళ్తామని స్పష్టం చేశారు. హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటేనని, సీఎం రేవంత్ రెడ్డి అన్న కు కూడా నోటీసులు ఇచ్చారని, తన ఇల్లు అక్రమమైతే కూల్చాలని ఆయన స్వయంగా చెప్పాడని మంత్రి గుర్తు చేశారు. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయని, అన్నింటిపైన విచారణ జరుగుతుందని చెప్పారు. ఎవరిపైనా వ్యక్తిగత కక్షలుండవని స్పష్టం చేశారు. 

అపార్ట్​మెంట్ నిర్వాసితులకు ఏ రకంగా న్యాయం చేయాలన్నదానిపై సీఎం ఆలోచిస్తున్నారని,  బిల్డర్ల చేతిలో మోసపోయిన వారి విషయంలో మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తామని చెప్పారు. 1920 లో కూడా మూసీ పైన కట్టడాలు తొలగించి.. ప్రత్యామ్నాయం చూపించారని,  రాష్ట్రానికే గ్రోత్ ఇంజిన్ ఇవ్వాలన్న ఉద్దేశం తోనే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామన్నారు.  ‘‘హైదరాబాద్ వాసులు మురికికంపుతో ఉండాలా? మూసీ నదిలో నివాసం ఏర్పరుచుకున్న వారికి ప్రభుత్వం అండగా ఉండాలా? వద్దా? అక్రమ నిర్మాణాలను చూస్తూ ఊరుకోవాలా? అని మంత్రి శ్రీధర్​బాబు ప్రశ్నించారు.