- సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన ఎస్ఈఐ ఇన్వెస్ట్మెంట్స్కంపెనీ రాష్ట్రంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జీసీసీ ద్వారా వచ్చే మూడేండ్లలో ఇంజినీరింగ్, ఫైనాన్షియల్సెక్టార్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
తద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో గ్లోబల్ హబ్‌గా తెలంగాణను నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యం మరింత బలపడుతుందన్నారు.
మంగళవారం సంస్థ గ్లోబల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాకరీ వోమాక్, గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ డేవిడ్ లాంగ్డేల్, చీఫ్ డేటా ఆఫీసర్ దీపక్ భరద్వాజ్, సంస్థ ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ డివిజన్ హెడ్మీనాక్షి మీల్, ఎస్ఈఐ ఇండియా డెలివరీ హెడ్ షానూ మనియార్లతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. బీఎఫ్ఎస్ఐలో హైదరాబాద్గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్నదని, ఈ రంగంలో జీసీసీల ఏర్పాటుకు అత్యంత నైపుణ్యం కలిగిన యువత కీలక పాత్ర పోషిస్తారని వివరించారు.
ప్రపంచంలోని టాప్ 5 బీఎఫ్ఎస్ఐ సంస్థలు అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్, గోల్డ్‌మాన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గోలు ఇప్పటికే జీసీసీలు ఏర్పాటు చేశాయన్నారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో ఆఫర్ చేస్తున్న బీఎఫ్ఎస్ఐ ప్రోగ్రామ్ ద్వారా ఎస్ఈఐకి అవసరమైన ట్యాలెంట్ పూల్‌ను అందిస్తామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎస్ఈఐ సంస్థలో 5 వేల మంది పనిచేస్తున్నారని, హైదరాబాద్‌ను స్ట్రాటజిక్ హబ్‌గా సంస్థ భావిస్తున్నదని చెప్పారు. జీసీసీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతున్నదని సంస్థ ప్రతినిధులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించిందని వారు ప్రశంసించారు.
ఐఎంసీలో తెలంగాణ ఏఐ పెవిలియన్‌ను సందర్శించిన శ్రీధర్‌బాబు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని భారత్ మండపంలో ఆసియాలోనే బిగ్గెస్ట్ టెక్ ఈవెంట్ ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ – 2024’ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్(డీఓటీ), సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ)లు సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ ఈవెంట్ ఈ నెల 17 వరకు జరగనుంది.
దీనిలో తెలంగాణ ప్రభుత్వం పార్ట్ నర్ స్టేట్‌గా కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రితో పాటు 10 మంది సాంకేతిక నిపుణులు ఇందులో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సుమారు 1,100 చదరపు విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఏఐ పెవిలియన్ ను సందర్శించారు. తొలిరోజు తెలంగాణ పెవిలియన్ ను పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు, సాంకేతిక నిపుణులు సందర్శించారు. కాగా.. బుధవారం తెలంగాణ స్టేట్ ఏఐ మిషన్ విజన్‌పై ఐటీ మంత్రి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.