ఫోర్త్​ సిటీలో గోల్ఫ్​సిటీ..మంత్రి శ్రీధర్​బాబు

ఫోర్త్​ సిటీలో గోల్ఫ్​సిటీ..మంత్రి శ్రీధర్​బాబు
  • పీజీఏ, స్టోన్​క్రాఫ్ట్​ కలిసి ఏర్పాటు చేస్తున్నయ్:మంత్రి శ్రీధర్​బాబు
  • పదేండ్లలో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి

'హైదరాబాద్, వెలుగు: ప్రొఫెషనల్​ గోల్ఫర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ అమెరికా (పీజీఏ), స్టోన్​ క్రాఫ్ట్​తో కలిసి హైదరాబాద్​ సిటీ దక్షిణాదిన నిర్మించతలపెట్టిన ఫోర్త్​ సిటీలో గోల్ఫ్​ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు తెలిపారు. రాబోయే పదేండ్లలో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. శనివారం సెక్రటేరియెట్​లో అమెరికాలోని ఫ్రిస్కోకు చెందిన పీజీఏ ప్రతినిధులు మంత్రి శ్రీధర్​బాబుతో సమావేశమయ్యారు.

 గోల్ఫ్​ కోర్టులు, రెసిడెన్షియల్​ కాంప్లెక్స్​లు, హోటళ్లు, ఎంటర్​టైన్​మెంట్​ హబ్​లను ఏర్పాటు చేసేందుకు పీజీఏ, స్టోన్​క్రాఫ్ట్​ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని శ్రీధర్​బాబు చెప్పారు. ప్రస్తుతం పీజీఏ సంస్థ..షాపూర్​జీ పల్లోంజీ సంస్థతో కలిసి ముంబైలో గోల్ఫ్​ సిటీని నిర్మిస్తున్నదని తెలిపారు. ఇక్కడ స్టోన్​క్రాఫ్ట్​ భాగస్వామ్యంతో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని వివరించారు. ఫోర్త్ సిటీలో ఎలాంటి కాలుష్యం వెలువడని నెట్-జీరో సిటీని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్మాణాలకు మూడింతలు ప్రకృతి వనాలను పెంచడం ద్వారా ఆహ్లాదకర నివాస ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తామని సంస్థలు వెల్లడించాయన్నారు. 

పీజీఏ కన్సార్టియం దాదాపు 200 ఎకరాల్లో ‘18 హోల్’ స్టాండర్డ్​ గోల్ఫ్​ కోర్సును ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పీజీఏ ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా సంస్థల్లో ఒకటని, 30,000 మందికి పైగా గోల్ఫ్ నిపుణులు ఆ సంస్థలో పనిచేస్తున్నారని చెప్పారు. పలు చాంపియన్‌‌షిప్‌‌లు, రైడర్ కప్ వంటి టోర్నీలను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ భేటీలో స్టోన్ క్రాఫ్ట్ సీఈవో కీర్తి చిలుకూరి, అలోక్ తివారీ, పీజీఏ ప్రతినిధులు టిమ్ లాబ్, అలెక్స్ హే, డేవిడ్ బ్లమ్, కెన్ సాగర్, రాధా కిశోర్, తదితరులు పాల్గొన్నారు. 

నిర్మాణ రంగంలో హైదరాబాద్​ టాప్​

నిర్మాణ రంగంలో  దేశంలోనే  హైదరాబాద్​అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి చెప్పారు. కొంపల్లిలోని ఆస్పిషియస్​ కన్వెన్షన్​ సెంటర్​లో రూఫ్​ అండ్​ ఫ్లోర్​ ప్రాపర్టీ షోను కాంగ్రెస్​ నేత మైనంపల్లి హన్మంతరావుతో కలిసి శ్రీధర్​బాబు ప్రారంభించారు. బిల్డర్లు, రియల్​ ఎస్టేట్​ డెవలపర్లతో మాట్లాడారు. రెచ్చగొట్టేవారి మాటలు విని ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రాపర్టీ షోలో 15 మంది డెవలపర్లు సుమారు 100 ప్రాజెక్టులను ప్రదర్శించారు. అపర్ణా కన్​స్ట్రక్షన్స్​, ప్రైమార్క్, సాకేత్ డెవలపర్స్, సుబిషి ఇన్​ఫ్రా, శిల్పా ఇన్ఫ్రాటెక్, మోడీ బిల్డర్స్, శాంతా శ్రీరామ్, గోల్డెన్ కీ, గ్రోత్ స్టోరీస్, లెక్సస్ గ్రూప్, ఎస్ క్యూబ్, తదితర సంస్థలు షోలో పాల్గొన్నాయి. ఆదివారం కూడా ప్రాపర్టీ షో కొనసాగనున్నది.