కొంగరకలాన్​లో కేన్స్​.. 2 వేల మంది యువతకు ఉపాధి

కొంగరకలాన్​లో కేన్స్​.. 2 వేల మంది యువతకు ఉపాధి

రంగారెడ్డి, వెలుగు: హైదరాబాద్  నగర శివారులో కేన్స్  టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్  తయారీ కేంద్రం ఏర్పాటుతో చుట్టుపక్కన ఉండే సుమారు 2 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ లో కేన్స్  సంస్థకు చెందిన ఎలక్ట్రానిక్స్  తయారీ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో 7 రాష్ట్రాల్లోని 10 పట్టణాలలో కేన్స్  టెక్నాలజీ సంస్థ విస్తరించి ఉందని, ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేయడం శుభసూచకమన్నారు. ఈ ప్రాంతంలోని కంపెనీ ఏర్పాటుతో 2 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని మంత్రి కోరారు. 

ఇటీవలే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు పనులు ప్రారంభించిందని, దీంతో నాలుగో పట్టణంగా ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో హైదరాబాద్ కు రీజనల్  రింగ్  రోడ్  ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్  సిస్టం డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్  సొల్యూషన్స్‌‌‌‌లో కేన్స్ గ్లోబల్  లీడర్  అని, అలాంటి సంస్థ తమ ప్రాంతంలో కంపెనీ పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇలాంటి కాలుష్యం లేని సంస్థలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్  శశాంక, కేన్స్  టెక్నాలజీ చైర్మన్  సబిత, ఎండీ రమేష్ కణ్ణన్, సీఈఓ రఘు పాణికర్, రాష్ట్ర మౌలిక, పారిశ్రామిక కల్పన సంస్థ వైస్ చైర్మన్  విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.