- ఏఐ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నం
- హైటెక్ సిటీలో డీటీసీసీ రెండో ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అంటే తెలంగాణ.. అందులో హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ అనగానే అందరికీ కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీలే గుర్తుకొస్తాయని, కానీ.. ఇక్కడ అన్ని రంగాలకు చెందిన కంపెనీలున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డిపాజిటరీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పొరేషన్ (డీటీసీసీ) కొత్త ఆఫీసును హైటెక్‌సిటీలో సోమవారం శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం. 200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని నిర్మించబోతున్నాం. అక్కడే ఏఐ వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ వర్సిటీ నిర్వహణలో సంబంధిత పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తాం” అని తెలిపారు. 100 నుంచి 120 కంపెనీలు ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలందిస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలో అన్ని రకాల పరిశ్రమలను స్థాపించేందుకు అనువైన వాతావరణం ఉన్నదని, ఇక్కడ నిశ్చింతగా పెట్టుబడులు పెట్టొచ్చన్నారు. డీటీసీసీతో మరో 500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మున్ముందు మరో 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రెనీ లారోకే మోరీస్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లిన్ బిషప్ తదితరులు పాల్గొన్నారు.