- గ్రాడ్యుయేట్లలో నైపుణ్యం కొరవడింది
- స్కిల్స్ పెంచేందుకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తం
- ఈ ఏడాది 2 వేల మందికి శిక్షణ
- ముచ్చర్లలో స్కిల్ వర్సిటీకి పర్మినెంట్ క్యాంపస్
- వన్ డిస్ట్రిక్ట్.. వన్ ఇండస్ట్రీ పాలసీ ముందుకు తీసుకెళ్తం
- అసెంబ్లీలో స్కిల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడేలా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని ఐటీ మినిస్టర్ శ్రీధర్‌బాబు అన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని తెలిపారు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయని అన్నారు. వారిలో స్కిల్స్ పెంచేందుకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. గురువారం అసెంబ్లీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘2 లక్షల ఉద్యోగాలిచ్చినా.. ఇంకా 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం తరఫున అందరికీ ఉద్యోగాలివ్వడం సాధ్యం కాదు. యువతలో స్కిల్స్ పెంచుతాం. పారిశ్రామికవేత్తలు, వీసీలు, స్కాలర్లు, స్టూడెంట్లతో చర్చించాం. ఇందులో భాగంగానే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నం’’అని అన్నారు. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టీకల్ కాంపోనెంట్‌ను కలిగి ఉంటాయని తెలిపారు. ‘‘స్కిల్స్, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నం. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో దోహదం చేస్తుంది. మరిన్ని పరిశ్రమల స్థాపనకు సహకరిస్తుంది’’అని అన్నారు.
కీలక రంగాల్లో యువతకు శిక్షణ
కంపెనీల భాగస్వామ్యంతో హెల్త్‌కేర్, ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, టూరిజం, ఆటోమోటివ్, లాజిస్టిక్స్, లైఫ్‌సైన్స్, బీఎఫ్ఐసీ, ఫిజిక్స్‌వాలా, న్యాక్, వీఎఫ్ఎక్స్ వంటి పలు రంగాల్లో యువతకు శిక్షణ ఇస్తామని శ్రీధర్ బాబు అన్నారు. ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్ షిప్ ఇస్తామని, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఇంజినీరింగ్ లో ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పారు. ఫేజ్ వన్‌లో భాగంగా 2024–25 ఫైనాన్షియల్ ఇయర్లో రెండువేల మంది స్టూడెంట్లకు, ఆ తర్వాతి ఏడాది 10వేల మందికి శిక్షణ ఇస్తామన్నారు. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం పర్మినెంట్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
బీజేపీ, ఎంఐఎం సలహాలు బాగున్నయ్
బీజేపీ, ఎంఐఎం సభ్యులు మంచి సలహాలు ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తామని తెలిపారు. ‘‘మంచి ఆశయంతో స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. యువతను గొప్ప మానవ వనరులుగా తీర్చిదిద్దుతాం. విన్ టు విన్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తాం. స్థూల జాతీయోత్పత్తిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అర్థవంతమైన కార్యాచరణ చేస్తాం. ఎస్సీ, ఎస్టీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’అని అన్నారు.
వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులను తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ‘‘వన్ డిస్ట్రిక్ట్, వన్ ఇండస్ట్రీ పాలసీని ముందుకు తీసుకెళ్తం. వ్యాపార దిగ్గజాలను వర్సిటీ చైర్‌పర్సన్‌గా నియమిస్తం. న్యాక్, ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్తో అనుసంధానం చేస్తం’’అని అన్నారు.
బీఆర్ఎస్ సభ్యులపై శ్రీధర్ బాబు సీరియస్
అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీచ్ ఆపాలంటూ నిరసన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీరియస్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు సరికాదు. పదేండ్లు పాలించిన సభ్యులకు సభ నియమాలు తెలియవా? నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నరు. కాంగ్రెస్, బీజేపీలు సిద్ధాంత పరంగా వేరైనా.. బిల్లుకు మద్దతిచిన్రు. అసెంబ్లీ అనేది స్లోగన్స్‌కు ప్లాట్‌ఫాం కాదు’’అని ఫైర్ అయ్యారు. స్పీకర్ కూడా బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నేలపై కూర్చొని నిరసన తెలిపారు.