కిషన్​రెడ్డీ.. ఆ ఏనుగులుఎటుపోయినయ్​?: శ్రీధర్ బాబు

కిషన్​రెడ్డీ.. ఆ ఏనుగులుఎటుపోయినయ్​?: శ్రీధర్ బాబు
  • కిషన్​రెడ్డీ.. ఆ ఏనుగులుఎటుపోయినయ్​?
  • ఏఐ ఫొటోలు, వీడియోలతోఫేక్​ పోస్ట్​లు పెడ్తవా?
  • అదే నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్​ చేసినవ్​?
  • కేంద్రమంత్రిపై మంత్రి శ్రీధర్​బాబు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: హెచ్‌సీయూ భూముల్లోకి ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చెప్పాలని మంత్రి శ్రీధర్​బాబు  డిమాండ్ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై  కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని  మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్  కలిసి ప్రధాని మోదీని కూడా తప్పుదోవ పట్టించారని అన్నారు. ‘‘ఆ భూమిలో ఏనుగులు ఉన్న వీడియోలను,  ఫొటోలను కిషన్​రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. తర్వాత అవి ఏఐ టెక్నాలజీతో రూపొందించినవని తెలుసుకొని తన అకౌంట్ నుంచి తొలగించారు. ఆ భూముల్లో నిజంగానే ఏనుగులు ఉంటే కిషన్​రెడ్డి వాటిని ఎందుకు తొలగించినట్లు. ఆ ఏనుగులు ఎటుపోయినయ్​?’’ అని నిలదీశారు.  కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే  ప్రధాని మోదీ కూడా నిజమేనని నమ్మి, దీనిపై స్పందించారని చెప్పారు. 

బుధవారం గాంధీ భవన్ లో మంత్రి శ్రీధర్ బాబు  మీడియాతో చిట్ చాట్ చేశారు.  నగర శివారు ప్రాంతం కావడం, పైగా చెట్లు ఉండడంతో నెమళ్లలాంటివి రావడం సహజమేనని అన్నారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు.  తమకు న్యాయస్థానం అంటే గౌరవం ఉందని, సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు.  కంచ గచ్చిబౌలి  భూములకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్​ నేతలు తప్పుడు పోస్టులు పెట్టారని, అలాంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.  ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అయినా.. ఇంకెవరైనా చట్టానికి   అతీతులు కారని స్పష్టం చేశారు. ఇందులో తాను ఏ ఒక్కరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం లేదని చెప్పారు. 

సన్నబియ్యం పంపిణీపై పర్యవేక్షణ

సన్నబియ్యం పంపిణీపై పర్యవేక్షిస్తున్నామని, వాటిని అమ్మేవారిపై కూడా తమ ప్రభుత్వం నిఘా ఉంచుతుందని  శ్రీధర్ బాబు చెప్పారు. ధరణి పోర్టల్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుందని తెలిపారు.  జపాన్ లోని ఒసాకా ఫెస్టివల్ లో ఇండియా ఫెవిలియన్ ను  ప్రారంభిస్తున్నామని, టూరిజం, ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జపనీస్ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారని తెలిపారు. సీఎం మార్పు అనేది లేదని, తమ సీఎం రేవంత్ రెడ్డియేనని, ఆయన నాయకత్వంలోనే అందరం కలిసి పనిచేస్తామని శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన, సిద్ధాంతాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు. కవిత పింక్ బుక్ అంటూ బెదిరిస్తున్న విషయంపై స్పందిస్తూ...అసలు బీఆర్ఎస్ వాళ్లు అధికారంలోకి వస్తే కదా దాని ప్రస్తావన ఉండేదని చురకలంటించారు.  రాజకీయ దురుద్దేశంతోనే సోనియా, రాహుల్ పేర్లను చార్జ్ షీట్ లో ఈడీ చేర్చిందని మంత్రి శ్రీధర్​బాబు ఆరోపించారు. వ్యవస్థలను ఉపయోగించి తమ నేతలను భయభ్రాంతులకు గురి చేయాలని కేంద్రం చూస్తున్నదని, ఇలాగే ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

అభివృద్ధిని అడ్డుకునే కుట్ర

 కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. మొదటి రోజు నుంచే రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు చేసినా తమది కూలిపో యే ప్రభుత్వం కాదన్నారు. సన్నబియ్యం, రాజీవ్ యువ వికాసం పథకాలకు జనంలో మంచి ఆదరణ వస్తుంటే.. వాటి నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. ఏ పథకాలను ఎవరు తుస్సుబాంబులని విమర్శించినా.. తమ ప్రభుత్వం వాటిని పేదల వద్దకు తీసు కెళ్తుందన్నారు. జూన్ 2 వరకు భూ భారతిపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్  తీసుకొని.. లోపాలు ఉంటే సవరణలు చేస్తామని చెప్పారు.