హైదరాబాద్/జీడిమెట్ల, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రతి నెలా సగటున 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పారు. ఏడాదిలో 50 వేలకు పైగా కొలువులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మిగతా ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. సోమవారం బాచుపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో 39వ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్టుగా శ్రీధర్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక రంగానికి సేవలందిస్తున్న శాంతా బయోటెక్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డికి విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ..దేశవిదేశాల్లో తెలుగు భాష, సాహిత్యం, లలిత కళల ఔన్నత్యాన్ని చాటుతున్న తెలుగు వర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుందని చెప్పారు. ఐటీ, పార్మా , సేవా రంగాల్లో ఉపాధి ఉన్నా.. లలిత కళా రంగాల్లో కూడా ఉపాధిని పొందేలా తెలుగు వర్సిటీ నైపుణ్య శిక్షణా కేంద్రంగా నిలిచినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి యూనివర్సిటీకి అన్ని విధాలుగా టెక్నికల్ సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. వెంటనే వర్సిటీకి కావాల్సిన కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, సంబంధిత పరికరాలను సమకూర్చుతామని ఆయన హామీనిచ్చారు. విశిష్ట పురస్కారం అందుకున్న వరప్రసాద్ రెడ్డి వ్యక్తి కాదని, వైద్య రంగంలో అసమాన కీర్తిని పొందిన శక్తిగా నిలిచారని పేర్కొన్నారు.
ఇది అంతర్జాతీయ వర్సిటీ: వీసీ
తెలుగు వర్సిటీ రాష్ట్ర యూనివర్సిటీ కాదని, అంతర్జాతీయ యూనివర్సిటీ అని వర్సిటీ వీసీ వెలుదండ నిత్యనందరావు అన్నారు. అమెరికా, మలేషియా, మారషస్ తదితర దేశాల్లో వర్సిటీ అనుబంధ సంస్థలు తెలుగు భాషా సాహిత్య వికాసానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతే తెలుగు వారికి బలం, అస్తిత్వం అని పేర్కొన్నారు. వీటిని కాపాడుకోవడానికి తెలుగు వర్సిటీ అవసరమని, దానికి సర్కారు సహకారం కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, వర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, నిజాంపేట మున్సిపల్ మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌంత పొట్రు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వర్సిటీకి కోటి విరాళం
తెలుగు వర్సిటీ ఏటా ఇచ్చే విశిష్ట పురస్కారాన్ని శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు కేఐ వరప్రసాద్రెడ్డికి అందజేశారు. పురస్కారంతో పాటు రూ.లక్ష చెక్కును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో మౌలిక వసతుల కోసం పురస్కార నగదుతో పాటు రూ.కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. కోటి రూపాయల చెక్కును మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో వర్సిటీ ఉపాధ్యక్షుడు నిత్యానందకు అందజేశారు.