బీజేపీకి హిందువుల గురించి మాట్లాడే హక్కే లేదు: మంత్రి శ్రీధర్ బాబు

బీజేపీకి హిందువుల గురించి మాట్లాడే హక్కే లేదు: మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్: అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.. దీనిని దృష్టిలో పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం (ఫిబ్రవరి 17) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

పట్టభద్రులకు ఉద్యోగ అవకాశం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలు ప్రయత్నాలు చేస్తోందని.. పెండింగ్‎లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చామంటే వెనక్కి తగ్గమని.. సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం గురించి బీజేపీ కేంద్రమంత్రి అడ్డగోలుగా మాట్లాడడం సరికాదని చురకలంటించారు. 

హిందువుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ వాళ్లకు లేదన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్న హైకమాండ్‎తో మాట్లాడి.. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయించండని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని.. టేలాండ్ ప్రాంతాల ప్రజలకు సాగు, తాగు నీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు.