నిరంతరం పేదల కోసం తాపత్రయపడే నాయకులు రత్నాకర్ రావు: మంత్రి శ్రీధర్ బాబు

నిరంతరం పేదల కోసం తాపత్రయపడే నాయకులు రత్నాకర్ రావు: మంత్రి శ్రీధర్ బాబు

కోరుట్ల: భావితరాలకు దశదిశ నిర్దేశించి జీవితం అంకితం చేసిన నాయకులు జువ్వాడి రత్నాకర్ రావు అని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ జయంతి (అక్టోబర్ 4) సందర్భంగా కోరుట్లలో ఇవాళ ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నాన్న శ్రీపాదరావు చనిపోయినప్పుడు నన్ను రత్నాకర్ రావు, జీవన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలోకి తీసుకొచ్చారని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గుర్తు చేసుకున్నారు. శాసనసభ్యునిగా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా వెనుక ఉండి నడిపించింది రత్నాకర్ రావు, జీవన్ రెడ్డి అని అన్నారు. 

ALSO READ | నిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపం జువ్వాడి రత్నాకర్ రావు: ఎంపీ వంశీకృష్ణ

 

పేదలకు అండగా ఉండాలని నిరంతరం తాపత్రయపడే నాయకులు రత్నాకర్ రావు అని ప్రశంసించారు. దేవాదాయ శాఖ మంత్రిగా దీప దూప నైవేద్య కార్యక్రమం చేపట్టి దేవాలయాలలో దీపం వెలిగించి ఆదర్శంగా నిలిచారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కీలక నాయకుడు జువ్వాడి రత్నాకర్ రావు అని వ్యాఖ్యానించారు. రైతుల కోసం అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి వెంటపడి కోరుట్లలో వెటర్నరీ కాలేజ్ ఏర్పాటు చేసిన మహనీయుడు రత్నాకర్ రావు అని గుర్తు చేశారు. వెటర్నరీ కాలేజ్ ఏర్పాటుతో ఇక్కడ ఎందరో యువకులకు ఉద్యోగ అవకాశం లభిందని తెలిపారు.