పథకం ప్రకారమే కలెక్టర్‎పై దాడి.. ఈ ఘటన వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‎పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 2024, నవంబర్ 12న సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే కొందరు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్‎పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‎పై దాడి ఘటనపై కచ్చితంగా సమగ్ర విచారణ చేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్‎పై దాడి ఘటనలో కుట్రదారులెవరు.. తప్పుదోవ పట్టించి కలెక్టర్‎ను గ్రామంలోకి తీసుకెళ్లింది ఎవరనే దానిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. లగచర్ల ఘటన వెనక ఎవరున్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఖరాఖండిగా మంత్రి చెప్పారు. 

అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరూ ప్రయత్నించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు, ప్రజలకు ఏమైనా అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్య పద్దతిలో చెప్పొచ్చని.. ఇలా అధికారులపై భౌతికి దాడులకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. సమస్యలపై ప్రజాస్వామిక పద్దతిలో ముందుకెళ్తున్నామన్నారు. రైతులను సభాస్థలికి రాకుండా కొందరు అడ్డగించారని.. దీంతో రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్ వెళ్లాడని.. ఈ క్రమంలోనే పథకం ప్రకారం అధికారులపై దాడి చేశారని చెప్పారు. ప్రభుత్వ విధానాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. 

ALSO READ | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‎పై వాదనలు కంప్లీట్.. కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

అప్రజాస్వామికంగా దాడులు చేస్తే సహించమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారం పోయిందనే ఆక్రోషంతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకోవడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. అభివృద్ధి అవరోధకులుగా బీఆర్ఎస్ నేతలు తయారయ్యారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు ఈ విధంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో ముఖ్యమని.. ఇందులో భాగంగానే ప్రభుత్వం పరిశ్రమలను ఏర్పాటు చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.