- యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, కొత్త టెక్నాలజీ కోసం ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
- విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం ప్రయారిటీ
- 30 కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ కోర్సులు పెడతం
- వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా డెవలప్ చేస్తామని వెల్లడి
హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. డిగ్రీలు, ఇంజినీరింగ్‌లు చదివినా స్కిల్స్ లేకపోతే వెనుకబడిపోతామని, అందుకే రాష్ట్రంలో ఇండస్ట్రీ ఒరియంటెడ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేకంగా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్ లాంటి కోర్సులకు ప్రాధాన్యం ఉంటుందని, కొత్తగా టెక్నాలజీని డెవలప్ చేసేందుకు డిజిటల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వరంగల్‌లోని లాల్ బహదూర్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు హనుమకొండ ఇందిరానగర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఆయన ప్రారంభించారు. తర్వాత సర్క్యూట్ హౌస్ రోడ్డులోని కాకతీయ ఐటీ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గత సర్కార్ పదేండ్ల పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను విద్యా నిలయంగా మార్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు.
ప్రభుత్వం విద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కీలక పాత్ర పోషించబోతున్నాయని, అందుకు తగ్గట్టు కొత్త కోర్సులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్కూళ్లలో కూడా ఏఐపై అవగాహన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఐటీ నిపుణులను తయారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమల అభివృద్ధి కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మధ్యతరహా ఐటీ ఇండస్ట్రీస్ వరంగల్ లాంటి నగరాలకు వచ్చేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు.
తొందరలోనే బీఎఫ్‌ఎస్ఐ కోర్సులు..
కామర్స్, ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు రాష్ట్రంలో 30 కాలేజీలను ఎంపిక చేశామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తొందర్లోనే రాష్ట్రంలోని సెకండ్, థర్డ్ గ్రేడ్ పట్టణాల్లో కాలేజీల్లో కూడా బీఎఫ్‌ఎస్ఐ కోర్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
బీఏ, బీకాం, బీఎస్సీ ఏ కోర్సు చదివినా పరిశ్రమలే కేంద్రంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలన్నారు. రాబోయే కాలంలో ఎల్‌బీ లాంటి అనేక కాలేజీలు స్థాపించి, ఎగ్జిబిషన్ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల డెవలప్‌మెంట్‌కు కృషి చేస్తామని తెలిపారు. వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌బీ కాలేజీ ముందున్న బ్రిడ్జిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వారు ముందుకొచ్చి ఇక్కడి నగరాల్లో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా ఇండస్ట్రీస్, సాఫ్ట్‌వేర్ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ లాంటి సిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు.