గుడ్ న్యూస్ : తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్

గుడ్ న్యూస్ : తెలంగాణలో  ఇంటింటికీ ఇంటర్నెట్
  • మారుమూల ప్రాంతాలకూ కేబుల్ టీవీ సేవలు: శ్రీధర్ బాబు 
  • బేగంపేటలో టీ ఫైబర్ కొత్త ఆఫీస్ ప్రారంభించిన మంత్రి 
  • టీ ఫైబర్ పేరును టీ నెక్స్ట్​గా మార్చుతున్నట్టు వెల్లడి
  • ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్  చైర్మన్‌‌గా బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫైబర్​నెట్ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బేగంపేటలో టీ ఫైబర్ కొత్త ఆఫీసును ఆయన ప్రాంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్ల సహకారంతో మారుమూల ప్రాంతాలకూ కేబుల్ టీవీ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. టీవీ సెట్లను కంప్యూటర్ మానిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వినియోగించుకుని విద్యార్థులు ప్రయోజనం పొందేలా టెక్నాలజీ రూపొందించినట్టు తెలిపారు. ‘‘టీ ఫైబర్ ఇప్పటికే 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసింది. మరో 7,187 పంచాయతీల్లో సేవలు అందిస్తాం.

 ఈ సంవత్సరం 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కల్పించాం. 2027 నాటికి 60 వేల కార్యాలయాలను అనుసంధానం చేస్తాం. టీ ఫైబర్ ఇకపై టీ నెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో సేవలు అందిస్తుంది” అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యాపార భాగస్వాములతో 9 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని చెప్పారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ కొత్త లోగోను ఆవిష్కరించారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన డేటాను సురక్షితంగా ఉంచే సావరిన్ క్లౌడ్, టీ ఫైబర్ కోసం కొత్త విజన్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్  చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.