- ప్రతిపక్షాల కుట్రలు, రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం భయపడదు: శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: ఫార్మా క్లస్టర్ల భూ సేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి, వారు అంగీకరిచిన తర్వాతే పనులు చేపడతామన్నారు. సమస్యలేమైనా ఉంటే రైతులు అధికారుల ముందు వెల్లడించాలని కోరారు. ప్రజల డిమాండ్లను తీర్చాకే భూసేకరణ చేపడతామన్నారు. ప్రతిపక్షాల కుట్రలకు, రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం భయపడదని హెచ్చరించారు. పదేండ్ల కాలంలో తామెన్నడూ అధికారులపై దాడులకు ఉసిగొల్పే కుట్రలకు పాల్పడలేదని తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే ఏ శక్తినీ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. గురువారం ఆయన హైటెక్స్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను తీసుకొచ్చామన్నారు. పది నెలల్లోనే రూ.35,820 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. 141 దేశీయ సంస్థలు, ఎంఎన్‌సీలు ఫార్మా, వ్యాక్సిన్, రీసెర్చ్ రంగాల్లో ఇప్పటికే తమ సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. ఎక్స్పాండ్ చేసుకున్న సంస్థలు ఇప్పటికే మాన్యుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాయన్నారు.
సంస్థలన్నీ పూర్తిగా అందుబాటులోకి వస్తే 51,086 మందికి ఉద్యోగాలు వచ్చాయని, పరోక్ష ంగా లక్షన్నర మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దేశంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త కంపెనీలకు హైదరాబాద్ కేంద్రమవుతుందన్నారు. జపాన్‌కు చెందిన టకెడా లైఫ్ సైన్సెస్ సంస్థ స్థానిక బయోలాజికల్ ఇ (బీఈ)తో కలిసి ఏటా 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందన్నారు. వీటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తాయన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద పశు వైద్య సంస్థ జోయెటిస్ ఇటీవలే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ను ప్రారంభించిందని వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బయోటెక్నాలజీ కంపెనీ యామ్ జెన్ 3,000 మందికి ఉద్యోగులను నియమించుకునే జీసీసీని ప్రారంభించిందన్నారు. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని, ఆ తర్వాత అతి తక్కువ టైంలోనే అవి జీసీసీలను నెలకొల్పాయని తెలిపారు.
రాష్ట్రంలో రీజనల్ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి..
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజనల్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. నాయకత్వ శిక్షణ, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి ట్రైనర్లకు శిక్షణనిచ్చే ఈ కేంద్రం వల్ల తెలంగాణకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ముంబైలో ఏర్పాటు చేసినట్టే ఇక్కడా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
సెమీకండక్టర్ల పరిశ్రమల ఏర్పాటు విషయంలో కేంద్రం హైదరాబాద్‌ను విస్మరించిందన్నారు. కాగా, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్ పాలసీని విడుదల చేస్తుందని తెలిపారు. సమావేశంలో తమిళనాడు ఐటీ మంత్రి పళనివేల్ త్యాగరాజన్, ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, లైఫ్‌సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్ప తదితరులు పాల్గొన్నారు.