- రాష్ట్రంలో మెరుగైన సౌలతులున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- అమెరికా పర్యటనలో 10 సంస్థల ప్రముఖులతో మంత్రి వరుస భేటీలు.. ‘అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రతినిధులతో మీటింగ్
- న్యూయార్క్‌లో మైండ్ టెక్ సర్వీసెస్ సంస్థతో చర్చలు
- బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కన్సార్టియంకు మద్దతిస్తామన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు : ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా అన్ని రంగాల్లోనూ ప్రపంచానికి హైదరాబాద్ డెస్టినేషన్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన యువత, స్టార్టప్ ఎకో సిస్టమ్స్ హైదరాబాద్ బలమని, సరికొత్త బిజినెస్ ఐడియాలకు గమ్యస్థానమని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు.. వివిధ సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి సంస్థ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.
ఇప్పటికే కోకాకోలా, ఒలంపస్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపగా.. తాజాగా మరికొన్ని సంస్థలతోనూ శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్‌లలో వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన భేటీ అయి పెట్టుబడులపై చర్చించారు. ముందుగా వాషింగ్టన్ డీసీలో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ డెలిగేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ను ఐటీకి గమ్యస్థానంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. అదే మీటింగ్‌లో బోయింగ్, రేథాన్, జీఈ హెల్త్‌కేర్, జాన్సన్ అండ్ జాన్సన్, యాక్సెంచర్, హెచ్‌పీ, ప్రాట్అండ్ విట్నీ తదితర సంస్థల ప్రతినిధులతోనూ మీటింగ్ నిర్వహించారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే నైపుణ్యాలను వృద్ధి చేయడం, నాణ్యమైన సేవలను అందించడం వంటి వాటిపై దృష్టి పెట్టామని వివరించారు.
రాష్ట్రంలో అంతర్జాతీయ నైపుణ్య యూనివర్సిటీ, ఏఐ సిటీ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై మైనర్ డిగ్రీని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కన్సార్టియంకు ప్రభుత్వం తరఫున తప్పకుండా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మౌలిక వసతుల కల్పన, హైదరాబాద్ వృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. సమావేశంలో టెక్నోజెన్ సీఈవో చేపూరి లక్ష్రావు, ఎక్విప్ సంస్థ చైర్మన్ లక్ష్మీనారాయణ, అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండియా చైర్మన్ సోమ్ సత్సంగి పాల్గొన్నారు.
మైండ్టెక్ సంస్థతో భేటీ
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా న్యూయార్క్‌లోని మైండ్ టెక్ సర్వీసెస్ సంస్థతోనూ మంత్రి శ్రీధర్ బాబు టీమ్ చర్చలు జరిపింది. సంస్థ సీఈవో డాన్ థెలెన్, సంస్థ టెక్నాలజీ సర్వీసెస్, సేల్స్ వింగ్ అడ్వైజర్ రోహన్ మంథాంకర్తో సమావేశమైన ఆయన.. హైదరాబాద్ ఐటీ హబ్‌గా విస్తరిస్తుండడాన్ని వివరించారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి మౌలిక వసతులున్నాయని, అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటికి తోడు అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ హైదరాబాద్ సొంతమని చెప్పారు. అంతకుమించి సృజనాత్మకతను ప్రోత్సహించేలా పటిష్టమైన స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. సరికొత్త బిజినెస్ ఐడియాలకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఉందన్నారు.
కేంద్ర మంత్రులకు శ్రీధర్‌బాబు శుభాకాంక్షలు
హైదరాబాద్‌ను ఐటీ, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాల్సిందిగా కేంద్రమంత్రులుగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న అశ్వినీ వైష్ణవ్, కుమారస్వామిని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్‌సైన్సెస్ వంటి రంగాల్లో దేశానికి హైదరాబాద్ గేట్వేగా ఎదుగుతున్నది. అత్యాధునికమైన ఉత్పత్తులను ప్రపంచానికి అందజేస్తున్నది. సంపద, ఉపాధి కల్పనలో కీలకమైన పాత్ర పోషిస్తున్నది. దేశాన్ని 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా వృద్ధి చేయడంలో అత్యంత ప్రాధాన్యమైన పాత్రనూ పోషిస్తున్నది.
కాబట్టి హైదరాబాద్‌లో ఐటీ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధికి కేంద్రం నుంచి సహకారం మరింత అవసరం. ఇప్పటికే ఏఐ సిటీ, గ్లోబల్ డిజిటల్ స్కిల్ యూనివర్సిటీ, సెమీకండక్టర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. సెప్టెంబర్‌లో ఏఐ సమిట్‌ను నిర్వహించబోతున్నాం. వాటికి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని శ్రీధర్ బాబు అన్నారు.