- కంపెనీ ఏర్పాటుకు ముందుకొస్తే రాయితీలిస్తం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు : సెమీకండక్టర్(చిప్‌ల తయారీ), దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్ అత్యంత అనుకూలమని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్ లో పీటీడబ్ల్యూ గ్రూప్ ఏషియా విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రభుత్వపరంగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శ్రీధర్ బాబు చెప్పారు. సరైన ప్రతిపాదనలతో వస్తే ఆహ్వానిస్తామని వెల్లడించారు.సెమీకండక్టర్ క్లస్టర్ ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు.
అయితే, రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉత్పాదక కేంద్రం మొదటి దశ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సంస్థ ఏషియా విభాగం ఎండీ టార్ స్టెన్ సెయ్ ఫ్రైడ్ తెలిపారు. సమావేశంలో సంస్థ స్థానిక భాగస్వామి బార్ ట్రానిక్స్ ఎండీ విద్యాసాగర్ రెడ్డి, సింగపూర్ కు చెందిన కన్సల్టెంట్ సంస్థ ‘టాప్2 పీటీఈ’ సీఈవో రావు పనిదపు తదితరులు పాల్గొన్నారు. కాగా.. సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలు, పునర్నిర్మాణం, ఆటోమేషన్, పరికరాలను సరఫరా చేసే ఈ సంస్థకు ప్రాంతీయ కార్యాలయం సింగపూర్ లో ఉంది.