బహ్రెయిన్​లో స్కిల్​ వర్సిటీ, టీహబ్​ పెడ్తం : మంత్రి శ్రీధర్​బాబు

బహ్రెయిన్​లో స్కిల్​ వర్సిటీ, టీహబ్​ పెడ్తం : మంత్రి శ్రీధర్​బాబు
  • ఆ దేశ రాయబారితో సమావేశం
  • హెల్త్​ సెక్టార్​లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి
  • హైదరాబాద్​లో మౌలిక సౌకర్యాలకు కొదవలేదన్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: స్కిల్​ యూనివర్సిటీ, టీహబ్, టీవర్క్స్​ లాంటి సంస్థలను బహ్రెయిన్​లో ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. బహ్రెయిన్​కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు. మంగళవారం సెక్రటేరియెట్​లో బహ్రెయిన్​ రాయబారి అబ్దుల్​ రహమాన్ అల్ గావుద్, బహ్రెయిన్ చాంబర్ ఆఫ్​ కామర్స్​ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్కిల్ యూని వర్సిటీని పరిశ్రమలే నిర్వహిస్తాయని, యువతకు సంస్థలే స్కిల్​పై శిక్షణ ఇస్తాయన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలకు మధ్య స్కిల్ యూనివర్సిటీ వారధిగా పనిచేస్తుందని చెప్పారు. 

రాష్ట్రంలో ఏటా 2 లక్షల మందికి పైగా ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్లు, లక్ష మంది వరకు సాధారణ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వారికి ఇష్టమైన రంగంలో స్కిల్స్ యూనివర్సిటీ నైపుణ్య శిక్షణ ఇస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా ప్రయోగం జరగలేదు. సీఎం రేవంత్​ రెడ్డి చొరవతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. సింగపూర్​ ఇన్ స్టిట్యూట్ ఆఫ్​ టెక్నికల్ ఎడ్యుకేషన్​(ఐటీఈ)తో విద్యార్థుల మార్పిడి, బోధనాంశాలను ఇక్కడ ప్రవేశపెట్టడంపై ఒప్పందాలు చేసుకున్నాం’’ అని మంత్రి వివరించారు. స్కిల్ వర్సిటీలో 33 రంగాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్య, ఆరోగ్య రంగాలపై తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నదని, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని బహ్రెయిన్​ చాంబర్​ ఆఫ్​ కామర్స్ ను మంత్రి కోరారు. ఫుడ్​ ప్రాసెసింగ్ లోనూ మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

200 ఎకరాల్లో ఏఐ సిటీ

హైదరాబాద్​లో మౌలిక సదుపాయాలకు కొదవ లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచ దేశాల కు సరఫరా అవుతున్న వ్యాక్సిన్లలో 40 శాతం హైదరాబాద్​లోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో 33 శాతం జనరిక్​ ఔషధాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీ హబ్, టీ వర్క్స్  సీఈవోలు, స్కిల్​ యూని వర్సిటీ వీసీతో వర్చువల్ కాన్ఫరెన్స్​ను ఏర్పాటు 
చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో బహ్రెయిన్ చాంబర్​ ఆఫ్​ కామర్స్​ ఉపాధ్యక్షుడు మహమ్మద్​ అల్​ కూహెజీ, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్​ తదితరులు పాల్గొన్నారు. 

గ్లోబల్​ టెక్నాలజీలో హైదరాబాద్​ కొత్త చరిత్ర

గ్లోబల్​ టెక్నాలజీలో హైదరాబాద్​ కొత్త చరిత్రను సృష్టిస్తున్నదని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) కు హైదరాబాద్​ కేంద్రంగా ఉందని, కొన్నేండ్లుగా సిటీలో జీసీసీలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇప్పుడు జీసీసీల నుంచి గ్లోబల్​ వాల్యూ సెంటర్స్​ (జీవీసీ)  ఏర్పాటు వరకు హైదరాబాద్​ ఎదిగిందని పేర్కొన్నారు. గ్లోబల్​ వాల్యూ చెయిన్​లో తెలంగాణను జీవీసీలు మరో స్థాయికి తీసుకెళ్తాయన్నారు. కాగా.. మంగళవారం హైసియా నిర్వహించిన 32వ నేషనల్ ​ సమిట్​ అవార్డుల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ‘ఏఐ అండ్​ బియాండ్​: రీడిఫైనింగ్​ ఫ్యూచర్​’ పేరిట హైసియా, సాఫ్ట్​వేర్​ టెక్నాలజీ పార్క్స్​ ఆఫ్​ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.