- పేదలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల రాజకీయం: శ్రీధర్ బాబు
- హైడ్రా, మూసీ కూల్చివేతలు ఒకటేనని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: మూసీ సుందరీకరణపై వెనక్కి తగ్గేది లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పేదలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘పెద్దల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తే, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే మూసీ రివర్ డెవలప్ మెంట్ పనుల్లో కొందరు అధికారుల అత్యుత్సాహంతో పేదలు ఆందోళనకు గురయ్యారు. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయంగా వాడుకుంటూ రాద్ధాంతం చేస్తున్నాయి. హైడ్రా, మూసీ కూల్చివేతలు ఒకటేనని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
మూసీ బాధితులతో మాట్లాడి, వాళ్లకు అర్థమయ్యేలా వివరిస్తాం. పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగనివ్వం” అని చెప్పారు. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్–2024’లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు.. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు.
‘‘బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేతుల్లోనే పవర్ ఉండేది. సీఎంవో నుంచి ఆదేశాలు వస్తేనే అధికారులు పనిచేసేటోళ్లు. కానీ మేం వచ్చాక అది మార్చేశాం. అంతేగానీ అడ్మినిస్ట్రేషన్ లో మాకు గ్రిప్ లేదన్న వార్తల్లో నిజం లేదు” అని అన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వివాదం ముగిసిందని, దీన్ని బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు.
అందుకే ఏఐపై దృష్టి..
కేటీఆర్ దావోస్ పర్యటనలో అత్యధికంగా రూ.21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే, తాము తొలి దావోస్ పర్యటనలోనే రూ. 41 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే ఏడాది ఇంతకుమించి పెట్టుబడులు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు రూ.2.45 లక్షల కోట్లు ఉన్నాయి. మేం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో వాటిని రూ.2.80 లక్షల కోట్లకు పెంచాం.
ఐటీ ఎగుమతుల్లో సుమారు రూ.8 లక్షల కోట్లతో బెంగళూర్ టాప్ లో ఉంది. నాలుగైదు ఏండ్లలో ఆ స్థాయికి చేరుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. బెంగళూర్ లో ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఒకేచోట ఉండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో రాకూడదనే చుట్టుపక్కల ఉన్న టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఐటీ విస్తరణకు కృషి చేస్తున్నం” అని వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు మంచి డిమాండ్ ఉందని, అందుకే దానిపై దృష్టిపెట్టామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సెమీకండక్టర్ ఫ్యాక్టరీలను పెట్టండి
హైదరాబాద్, వెలుగు: దేశంలో స్మార్ట్ ఫోన్లు, విద్యుత్తు వాహనాలు, ఇంటర్నెట్ కనెక్షన్లు భారీగా పెరగుతుండటంతో సెమీ కండక్టర్ అవసరాలు విస్తృతమయ్యాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు 100 కోట్లకు, విద్యుత్ వాహనాలు కోటికి, ఇంటర్నెట్ కనెక్షన్లు 200 కోట్లకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. సెమీకండక్టర్ పరిశ్రమల స్థాపన విషయంలో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో స్టార్టప్ లకు అనుకూల వాతావరణం కల్పించామని, మౌలిక వసతుల విషయంలో అగ్రగామిగా ఉన్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణాలో ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు కార్యాలయాలు నెలకొల్పాయని వివరించారు. ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ యూనిట్లను తెలంగాణాలో స్థాపించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.
సెమీకండక్టర్ల పరిశ్రమల విషయంలో తెలంగాణకు ప్రాధాన్యమివ్వాలని ఆయన కోరారు. దేశంలోనే అండర్ గ్రౌండ్ ఫైబర్ నెట్‌వర్క్ సిస్టంతో తెలంగాణ రాష్ట్రం నూతన ఆలోచనలతో ముందుకెళ్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దాదాపు రూ.3 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సిస్టం పూర్తి కావాలంటే దాదాపు రూ.1,600 కోట్ల నిధులు అవసరమవుతాయని, ఈ నిధుల్ని కేంద్రం సమకూర్చాలని ఆయన కోరారు.