మూసీ ప్రక్షాళనకు కార్పొరేషన్​ తెచ్చిందే బీఆర్ఎస్ : మంత్రి శ్రీధర్​బాబు

మూసీ ప్రక్షాళనకు కార్పొరేషన్​ తెచ్చిందే బీఆర్ఎస్ : మంత్రి శ్రీధర్​బాబు
  • అప్పుడు వాళ్లు చేస్తే మంచి.. ఇప్పుడు మేము చేస్తే తప్పా: మంత్రి శ్రీధర్​బాబు  
  • వాళ్లే బఫర్​ జోన్​ ఫిక్స్​ చేసి.. అక్రమ కట్టడాలను గుర్తించారు
  • పేద ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
  • మూసీ నిర్వాసితులను  ఆదుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌ను ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్ హయాంలో అని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. మూసీలో కాలుష్యం తీవ్రంగా ఉందని.. దానిని కాలుష్యరహితంగా మారుస్తామని చెప్పిందన్నారు. అప్పుడు వాళ్లు చేస్తే మంచి పని.. ఇప్పుడు తాము చేస్తే ఇంకోటి అవుతుందా? అని ప్రశ్నించారు. గతంలో వారు చేసిన పనులను ఆ పార్టీ నేతలే మరిచిపోతున్నారని ఎద్దేవా చేశారు.

మంగళవారం సెక్రటేరియెట్​లో మంత్రి శ్రీధర్​బాబు మీడియాతో మాట్లాడారు. 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్​ ఏర్పాటైందని  చెప్పారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా కార్పొరేషన్ ను ప్రకటించి.. చైర్మన్‌‌ను కూడా నియమించిందని వెల్లడించారు. మూసీ రివర్‌‌ఫ్రంట్‌‌ అభివృద్ధి ప్రణాళికను కూడా రూపొందించారని, అక్రమ కట్టడాల లెక్క తీసి వాటిని తొలగించాలని ప్రణాళికలో పొందుపరిచారని చెప్పారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8,480 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారని తెలిపారు.

అలాగే, మూసీ నదికి 50 మీటర్ల బఫర్‌‌జోన్‌‌ ఏర్పాటు చేసి హద్దులు గుర్తించాలని చెప్పారని తెలిపారు. మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్‌‌ ఎన్నో సమావేశాలు నిర్వహించారని వెల్లడించారు. మాస్టర్‌‌ ప్లాన్‌‌ను పూర్తి చేయాలని హైదరాబాద్‌‌, రంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారని గుర్తుచేశారు. అప్పుడు వాళ్లు తెచ్చిన జీవోలను తాము ఏమీ మార్చలేదని, వాటి ప్రకారమే ముందుకు వెళ్తున్నట్టు మంత్రి తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. పేదలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మూసీ నదిలో శుభ్రమైన నీరు పారించడం, హైదరాబాద్‌‌ సిటీకి స్వచ్ఛమైన గాలి అందించడమే మూసీ ప్రాజెక్ట్, హైడ్రా లక్ష్యాలని మంత్రి చెప్పారు. 

అక్రమ కట్టడాలు కూల్చాలని కేటీఆర్ ఆదేశించారు

బీఆర్ఎస్ నేతలు వారు తీసుకున్న నిర్ణయాలను మరిచిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని శ్రీధర్​బాబు మండిపడ్డారు. ‘‘2020లో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే బఫర్ జోన్ నిర్ధారించి ఇండ్లు కూల్చాలని నిర్ణయించారు. 2021లో మరో మీటింగ్ పెట్టి అక్రమ కట్టడాలు కూల్చాలని ఆదేశించారు. 2022లో మరో మీటింగ్ పెట్టి నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని చెప్పారు. మూసీకి రెండు వైపులా 55 కిలో మీటర్లు.. అంటే 110 కిలో మీటర్లు రోడ్లు వేయాలని, 50 మీటర్లు బఫర్ జోన్‌‌గా గుర్తించాలని 2017లోనే జీవో 90 తీసుకొచ్చారు”అని మంత్రి తెలిపారు.

‘‘ఆనాడు మీరు ఆలోచన చేస్తే మంచిది.. ఇప్పుడు మేము హైదరాబాద్​సిటీకి మంచి నీరు, గాలి ఇవ్వాలనుకోవడం తప్పా? మంచి ఆలోచనతో పని చేపడుతున్నాం. సమస్యను జఠిలం చేసేలా బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. కాళేశ్వరం, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఆనాడు మీరు ఎందుకు కనికరం చూపలేదు. మల్లన్నసాగర్ నిర్వాసితులను ఎంత నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారో మరిచిపోయారా? కనీసం  ఆర్ అండ్ ఆర్ కూడా ఇవ్వకుండా బలవంతంగా వెళ్లగొట్టారు. కానీ, మేము మూసీ నిర్వాసితులకు ఇండ్లు ఇస్తున్నాం. ఉపాధి చర్యలు చేపట్టాం.

వాళ్ల పిల్లలకు రెసిడెన్షియల్​ పాఠశాలల్లో అడ్మిషన్స్​ ఇస్తున్నాం. అందరితో చర్చించి ముందుకు వెళుతుంటే బురద జల్లడం ఏమిటి’’ అని శ్రీధర్​బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయి ఏం చేయాలో తోచక బురద చల్లుతున్నారన్నారని మండిపడ్డారు. మూసీ నిర్వాసితుల విషయంలో కింది స్థాయి అధికారులు తొందపాటుగా వ్యవహరిస్తే  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హెచ్చరించారు.