గవర్నమెంట్ బడుల్లో ఏఐతో స్కిల్​ డెవలప్​మెంట్ : మంత్రి శ్రీధర్​ బాబు

గవర్నమెంట్ బడుల్లో ఏఐతో స్కిల్​ డెవలప్​మెంట్ : మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​ (ఏఐ) సాయంతో స్కిల్​డెవలప్​మెంట్​శిక్షణ ఇస్తామని ఐటీ, ఇండస్ట్రీస్​శాఖ మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా గవర్నమెంట్​టీచర్లు బోధనా సామర్థ్యాలను మరింత పెంచుకునేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో మంత్రితో ఫిల్మ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ చైర్మన్​దిల్​రాజు, కోణం ఫౌండేషన్​ నిర్వాహకులు సందీప్​ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను  సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. 

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీని కూడా ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏఐ సాయంతో ఉచితంగా స్కిల్ డెవలప్‌‌మెంట్ లో శిక్షణ ఇస్తున్న కోణం ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఫౌండేషన్ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.